ప్రధానితో మోదీతో మీటింగ్‌కి ముందు రష్యా కీలక ప్రకటన! ఇండియా నుంచి దిగుమతులు..

భారతదేశం నుండి తన దిగుమతులను పెంచడానికి ఇప్పుడు నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా సూచించింది. దీంతో రష్యా తన మార్కెట్‌ను భారతీయ వస్తువులు, సేవలకు మరింత తెరవబోతోంది. అయితే రష్యా నుంచి ఈ ప్రకటన భారత వ్యాపారులకు సంతోషం కలిగిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధానితో మోదీతో మీటింగ్‌కి ముందు రష్యా కీలక ప్రకటన! ఇండియా నుంచి దిగుమతులు..
Pm Modi And Putin

Updated on: Dec 03, 2025 | 7:30 AM

ఈ నెల 4, 5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. దీని కంటే ముందే రష్యా భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. భారతదేశంతో తన వాణిజ్య సంబంధం ఏకపక్షంగా ఉండకూడదని రష్యా స్పష్టం చేసింది. భారతదేశం నుండి తన దిగుమతులను పెంచడానికి ఇప్పుడు నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా సూచించింది. దీంతో రష్యా తన మార్కెట్‌ను భారతీయ వస్తువులు, సేవలకు మరింత తెరవబోతోంది.

క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ.. వాణిజ్య సమతుల్యత ప్రస్తుతం రష్యాకు అనుకూలంగా ఉందని అంగీకరించారు. ఎందుకంటే రష్యా భారతదేశానికి పెద్ద మొత్తంలో చమురు, ఇంధన వనరులను విక్రయిస్తుంది. భారతదేశం కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి. “మేం భారతదేశం నుండి కొనుగోలు చేసే దానికంటే ఎక్కువ అమ్ముతున్నామని మాకు తెలుసు, మా భారతీయ స్నేహితులు దీని గురించి ఆందోళన చెందుతున్నారు అని పెస్కోవ్ అన్నారు.

ఈ ఆందోళనను పరిష్కరించడానికి రష్యా ఒక పెద్ద అడుగు వేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా ప్రత్యేక దిగుమతిదారుల ఫోరం జరుగుతుంది. భారతదేశం నుండి రష్యా మరిన్ని వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి మార్గాలను అన్వేషించడం దీని ప్రాథమిక లక్ష్యం. అయితే చమురు వాణిజ్య పరిమాణంలో తాత్కాలిక తగ్గుదల ఉన్నప్పటికీ, రష్యా భారతదేశానికి కీలక ఇంధన భాగస్వామిగా ఉంటుందని పెస్కోవ్ స్పష్టం చేశారు.

మోడీ-పుతిన్ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీలలో భారతదేశానికి అధికారిక పర్యటనలో ఉంటారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన 23వ భారతదేశం-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి