ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకం అనేది ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ప్రభుత్వ మద్దతుతో కూడిన పదవీ విరమణ పొదుపు పథకం. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిర్వహిస్తుంది. ఉద్యోగులు ప్రతి నెలా వారి ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో కొంత భాగాన్ని ఈపీఎఫ్‌కు జమ చేస్తారు. అలాగే ఉద్యోగి జమ చేసిన సమాన మొత్తాన్ని కూడా యజమాని జమ చేస్తారు. ఈపీఎఫ్ పథకం ఉద్యోగులు వారి ఉద్యోగ కాలంలో నెలవారీ విరాళాలతో పదవీ విరమణ కార్పస్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది. అలాగే వారు సూపర్‌యాన్యుయేషన్‌లో మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ పేరుకుపోయిన కార్పస్‌ను పదవీ విరమణ ముందు ఉపసంహరించుకోవాలంటే అనేక అంశాలు అమలులోకి వస్తాయి. ఈపీఎఫ్ పథకం ప్రధానంగా పదవీ విరమణ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకున్నందున, ముందస్తు ఉపసంహరణలు కొన్ని షరతులలో మాత్రమే అనుమతి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా పీఎఫ్ ఎలా విత్‌డ్రా చేసుకోవాలి? ముందస్తుగా పదవీ విరమణ తీసుకుంటే పీఎఫ్ ఏ మాత్రం వస్తుంది? వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
చాలా మంది ఈపీఎఫ్ చందాదారులు ముందస్తు పదవీ విరమణ విషయంలో కార్పస్ ఫండ్‌ను ఉపసంహరించుకోవడంపై తరచుగా గందరగోళాన్ని ఎదుర్కొంటారు. మీరు మీ రెగ్యులర్ జీతభత్యాల ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మీ ఈపీఎఫ్ ఖాతాను పదవీ విరమణ వయస్సు వరకు నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఒక ఉద్యోగి చిన్న వయస్సులోనే పదవీ విరమణ చేస్తే అతని ఈపీఎఫ్ ఖాతా మెచ్యూర్ కావడానికి ఇంకా సమయం ఉంటే ఏం చేయాలి? అనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి సందర్భాల్లో ఖాతా తదుపరి మూడు సంవత్సరాల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. అదే వ్యవధికి వడ్డీని పొందడం కూడా కొనసాగుతుంది. కంట్రిబ్యూషన్ చేసిన చివరి నెల నుంచి మూడు సంవత్సరాల తర్వాత ఖాతా ఇన్‌యాక్టివ్ అవుతుంది. ఇన్‌యాక్టివ్ ఖాతాలకు వడ్డీ జమకాదు. ఉదాహరణకు ఒక ఉద్యోగి నేటి తేదీ అంటే ఆగస్టు 2023న పదవీ విరమణ చేస్తే ఈపీఎఫ్ ఖాతా ఆగస్టు 2026 వరకు యాక్టివ్‌గా ఉంటుంది. దీనిని అనుసరించి అతను డబ్బును విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. లేదంటే సేకరించిన నిధులు తదుపరి వడ్డీని పొందడం ఆగిపోతాయి.
ఈపీఎఫ్‌ఓ ప్రకారం ఒక ఉద్యోగి తన మొత్తం ఈపీఎఫ్ మొత్తాన్ని 55 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అత్యవసర పరిస్థితుల్లో పాక్షిక ఉపసంహరణలు అంతకు ముందు అనుమతించబడతాయి. అలాగే ఈపీఎఫ్ కార్పస్‌లో 90 శాతం 54 సంవత్సరాల వయస్సులో అంటే పదవీ విరమణ వయస్సు కంటే ఒక సంవత్సరం ముందు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈపీఎఫ్ సభ్యుడు 2 నెలల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి