RBI: రూ.5, రూ.10, రూ.20 నాణెలు చెల్లవా..? ఆర్బీఐ నుంచి బిగ్ అప్డేట్..
నాణెల చెల్లుబాటుపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న నాణెలన్నీ చెల్లుబాటు అవుతాయని ప్రకటన జారీ చేసింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించింది. ఈ మేరకు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

భారత కరెన్సీ గురించి ఎప్పుడూ ఏదోక తప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. రూ.500 నోట్లు ఆర్బీఐ బంద్ చేయనుందని, ఏటీఎంలలో కూడా కనిపించడం లేదంటూ ఇటీవల నెట్టింట తెగ ప్రచారం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి.. అలాంటి ఆలోచన ఏం లేదని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ఇక దీంతో పాటు సోషల్ మీడియాలో మరో వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. భారత నాణెల గురించి ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. రూ.5, రూ.10, రూ.20 నాణెలను కొంతమంది వ్యాపారులు తీసుకోవడం లేదు. అవి చెల్లుబాటు కావంటూ దుకాణాదారులు స్వీకరించడం లేదు.
ఆర్బీఐ కీలక ప్రకటన
ఈ క్రమంలో నాణెల చెల్లుబాటుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక ప్రకటన చేసింది. రూ.5, రూ.10, రూ.20 నాణెలు చెల్లుబాటు అవుతాయని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని దేశ ప్రజలందరికీ సూచించింది. నాణెలు ఏ ఆకారంలో ఉన్నా చెల్లుతాయని స్పష్టం చేసింది. ఈ విషయం చెబుతూ దేశంలోని ప్రజలందరికీ వాట్సప్ ద్వారా ఆర్బీఐ మెస్సేజ్‌లు పంపుతోంది. గతంలోనూ దీనిపై ఆర్బీఐ ప్రకటన చేసినా.. అలాంటి ప్రచారాలు ఇప్పటికీ ఆగలేదు. దీంతో ఆర్బీఐ మరోసారి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రకటన జారీ చేసింది. నాణెలను స్వీకరించకపోతే దుకాణాదారులు, వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
శనివారం నుంచి అమల్లోకి..
ఈ సందర్భంగా ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. శనివారం నుంచి చెక్కుల క్లియరెన్స్ వేగవంతం చేసే ప్రక్రియను అమల్లోకి తీసుకురానుంది. ఇక నుంచి చెక్కులు డిపాజిట్ చేయగానే గంటల వ్యవధిలోనే బ్యాంకులు ప్రాసెస్ చేసేలా నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో వేగంగా చెక్కులు క్లియర్ కానున్నాయి. ఈ మేరకు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇక సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండల్సిందిగా ప్రజలకు ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఓటీపీ, పాస్‌వర్డ్ వంటివి ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సూచించింది. అలాగే పదేళ్లకుపైబడి వాడని బ్యాంక్ అకౌంట్లను మళ్లీ ఉపయోగించుకోవచ్చని, బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఈకైవేసీ పూర్తి చేయాలని అలాంటి ఖాతాదారులకు సూచించింది. ఒకవేళ ఖాతాదారులు మరణిస్తే కుటుంబసభ్యులు అకౌంట్లోని డబ్బులు పొందే వీలుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
