నెట్ సబ్‌స్క్రైబర్‌ల జోడింపులో రిలయన్స్ జియో మరోసారి తన పోటీదారు ఎయిర్‌టెల్‌ను అధిగమించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. మే నెలలో జియో 30.4 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది. మరోవైపు ఇదే కాలంలో ఎయిర్‌టెల్ 13.3 లక్షల మంది వినియోగదారులను చేర్చుకుంది.
వొడాఫోన్ ఐడియా దేశంలో తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను కోల్పోతోంది. ట్రాయ్ తాజా సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం.. టెలికాం ఆపరేటర్ మే, 2023 నెలలో 28 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. మే నెలలో జియో నికర సబ్‌స్క్రైబర్లు 43.6 కోట్లుగా ఉన్నారు. మే నెలలో ఎయిర్‌టెల్ నికర సబ్‌స్క్రైబర్లు 37.2 కోట్లు ఉండగా, వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య 23 కోట్లకు తగ్గింది.
ట్రాయ్ తాజా డేటా ప్రకారం.. ఎన్‌ఎంపీ అమలులోకి వచ్చినప్పటి నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) అభ్యర్థనలు ఏప్రిల్-23 చివరి నాటికి 83.06 కోట్ల నుంచి మే-23 చివరి నాటికి 84.2 కోట్లకు పెరిగాయి. మే, 2023 నెలలో 11.47 మిలియన్ల మంది చందాదారులు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం తమ అభ్యర్థనలను సమర్పించారని ట్రాయ్ తెలిపింది.
సర్వీస్ ప్రారంభించిన 10 నెలల్లోనే టెలికాం ఆపరేటర్లు 3 లక్షలకు పైగా 5G మొబైల్ సైట్‌లను ఇన్‌స్టాల్ చేశారని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. అయితే 714 జిల్లాల్లో 5జీ సైట్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన 5G రోల్ అవుట్ కొనసాగుతోంది. 714 జిల్లాల్లో 3 లక్షలకు పైగా 5G సైట్‌లు ఇన్‌స్టాల్ చేసినట్లు వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘కూ’లో తెలిపారు.
5G సేవలు అక్టోబర్ 2022లో ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 5G సేవలను విడుదల చేస్తున్న ఏకైక టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్. గత ఏడాది అక్టోబర్ 1న 5జీ సర్వీస్ లాంచ్ అయిన 10 నెలల్లోనే 3 లక్షలకు పైగా సైట్‌లు ఇన్‌స్టాల్ అయ్యాయని మంత్రి వెల్లడించారు. అధికారిక సమాచారం ప్రకారం.. సర్వీస్ ప్రారంభించిన ఐదు నెలల్లో 1 లక్ష సైట్లు, ఎనిమిది నెలల్లో 2 లక్షల సైట్లు ఇన్‌స్టాల్ అయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి