Reliance Infra Sells Reliance Centre : అప్పులు చెల్లించేందుకు ఆస్తులను అమ్మేస్తున్నాడు అనిల్ అంబానీ.. తాజాగా ‘రిలయన్స్ సెంటర్’ ప్రధాన కార్యాలయాన్ని రూ. 1,200 కోట్లకు యెస్ బ్యాంకుకు విక్రయించినట్టు తెలిసింది.. అనిల్ అంబానీ ఆధీనంలో ఉండే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఈ పని చేసింది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని అందులోంచి బయటపడేసేందుకు వేల కోట్ల విలువ చేసే తన ఆస్తిని అనిల్ అంబానీ అమ్మేశారు. ఈ ఏడాది జనవరిలో కూడా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన 2 ఆస్తులను విక్రయించింది.
ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ రూ. 3,600 కోట్లకు, పర్బతి కోల్డామ్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్‌ను రూ. 900 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా యెస్ బ్యాంకుకు రూ. 2 వేల కోట్ల బకాయి ఉంది. అప్పులను తీర్చిన ప్రకటన వచ్చిన అనంతరం కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా దూసుకెళ్లింది. 10 శాతం వరకు ర్యాలీ చేసిన తర్వాత మిడ్-సెషన్ సమయంలో 7.98 శాతంతో ఇంట్రాడే గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడయింది. ఇదిలా ఉంటే.. ఈ కార్యాలయాన్ని తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయంగా వినియోగించనున్నట్టు యెస్ బ్యాంకు పేర్కొంది.
బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పును తీర్చడానికే ఈ ఆస్తిని అమ్మినట్టు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్‌అంబానీ నివాసం ఆంటిలియా దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంబానీ ఇంటి దగ్గర అనుమానస్పదంగా కనిపించిన ఈ వాహనంలో జిలెటిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలసులు గుర్తించారు. ఈ విషయంలో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.