Hyderabad Real Boom: కనిపించని కరోనా ప్రభావం.. దూసుకుపోతున్న నిర్మాణ రంగం.. హైదరాబాద్ నగరం చుట్టూ రియల్ బూమ్

|

May 27, 2021 | 3:46 PM

కరోనా లాక్‌డౌన్, రిజిస్ట్రేషన్లకు సెలవులతో నేలచూపులు చూసి కుదేలైన రియల్ ఏస్టేట్ రంగం మూడు నెలల్లోనే తిరిగి భారీగా పుంజుకుంది.

Hyderabad Real Boom: కనిపించని కరోనా ప్రభావం.. దూసుకుపోతున్న నిర్మాణ రంగం.. హైదరాబాద్ నగరం చుట్టూ రియల్ బూమ్
Hyderabad Real Estate Boom
Follow us on

Hyderabad Real Estate Boom: కరోనా లాక్‌డౌన్, రిజిస్ట్రేషన్లకు సెలవులతో నేలచూపులు చూసి కుదేలైన రియల్ ఏస్టేట్ రంగం మూడు నెలల్లోనే తిరిగి భారీగా పుంజుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగర శివార్లలో పెద్ద ఎత్తున రియల్‌ వ్యాపారాల కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల్లో భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే హైదరాబాద్ నిర్మాణ పరిశ్రమ అమ్మకాలు 60% పైగా పెరిగాయి. 2020 జనవరి, మార్చి నెలల్లో 2,680 తో పోలిస్తే ఈ కాలంలో కొత్త గృహ ఒప్పందాల సంఖ్య 4,400 గా ఉందని మార్కెట్ నివేదికలు సూచిస్తున్నాయి.

ముఖ్యంగా నగర శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్‌ రిజిస్ట్రేషన్‌ జిల్లాల పరిధిలో ఏడాది కాలంలో జరిగిన కార్యకలాపాల్లో సగం మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే జరగడం విశేషం. ముఖ్యంగా శివార్లలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారితో పోటెత్తాయి. భూమిపై పెట్టుబడిని ఆదాయ వనరుగా మధ్యతరగతి వర్గాలు భావిస్తుండడంతో పాటు రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) లాంటి ప్రతిపాదనలు, కరోనా వైరస్‌ నేర్పిన పాఠంతో కాంక్రీట్‌ జంగిల్‌ను వదిలి ప్రశాంతత కోసం శివార్లలోని విల్లాలు, ఫామ్‌ హౌస్‌ల వైపు సంపన్నులు మొగ్గు చూపుతుండడం ఇందుకు కారణాలని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లోనే కనిపించడంతో… ఆ ప్రాంతానికి ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. దీంతో ఐటీ కేంద్రంగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట వరకు ఎకరం భూమి ధర రూ.30 కోట్లకు చేరగా… మెరుగైన రవాణా, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో.. కంపెనీలన్నీ అటు వైపు మొగ్గుచూపాయి. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్ కు దగ్గరగా, ఓఆర్ఆర్ ఆనుకుని ఉండటంతో… సౌత్ సిటీలోనూ రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది.

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం నలుదిశలా రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్లలో నిర్మాణ రంగానికి డిమాండ్ ఉండటంతో… సౌత్ సిటీలో ఉన్న చార్మినార్ కేంద్రంగా రాజేంద్రనగర్, మలక్ పేట్, సంతోష్ నగర్, చాంద్రయాణగుట్ట, ఫలక్ నుమా, రాజేంద్ర నగర్ సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి, కిషన్ బాగ్, నవాబ్ కుర్దు, సంతోష్ నగర్, లలిత్ భాగ్, ఉప్పుగూడ వంటి ప్రాంతాల్లో రెసిడెన్సియల్, కమర్షియల్ భవనాల నిర్మాణాలు జోరందుకున్నాయి.

అటు, సౌత్ సిటీ చుట్టూ ఫార్మా సిటీ, ఆదిభట్ల ఎయిర్ స్పేస్, తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ, శ్రీశైలం హైవే, కోకాపేట న్యూ సిటీ, బుద్వేల్ ఐటీ పార్క్, కాంచన్ బాగ్ డీఆర్డీఎల్, రాజేంద్ర నగర్ ఆగ్రి వర్సిటీ వంటి ప్రాంతాలకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయి. దీంతో కమర్షియల్ యాక్టివిటీ బాగా పెరుగుతోంది. ఇక్కడ భూముల రేట్లు వెస్ట్, ఈస్ట్ సిటీతో సమానంగా ఉండగా… ఐటీ కారిడార్ కు చేరువలో, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటం సౌత్ జోన్ కు స్పెషల్ అడ్వాంటేజ్.

కొత్త హౌసింగ్ ప్రాజెక్టుల ప్రారంభం కూడా ఈ ఏడాది హైదరాబాద్‌లో 7,000 పైగా నిర్మాణలకు చేరుకుంది. దీనివల్ల ఆస్తి ధరలకు సవరణ జరిగింది. చెన్నై, బెంగళూరు ఖర్చులు మారలేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మదిగా కానీ స్థిరంగా వృద్ధి చెందడానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. వీటిలో ఆస్తి ధరల సాపేక్ష స్థోమత, బలమైన మౌలిక సదుపాయాలు ఉండటంతో స్థిరాస్తుల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ, నగరం కార్యాలయ లీజింగ్ కార్యకలాపాలలో కొంత ఊపందుకుందని అనారోక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు.

హైదరాబాద్ మహానగర పరిధిలో 2020 మొదటి అర్ధభాగంలో ఉన్నదానికంటే గణనీయంగా మెరుగుపడింది. 2021 మొదటి త్రైమాసికం తరువాత సెంటిమెంట్ మందగించినప్పటికీ, దాని ప్రభావం తాత్కాలికమేనని నిపుణులు భావిస్తున్నారు. 2021 రెండవ భాగంలో వినియోగదారుల డిమాండ్‌ను మెరుగుపడుతుందంటున్నారు. ఇందుకు కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలే కారణమంటున్నారు. అంతేకాదు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుండటంతో మార్కెట్ ఖచ్చితంగా బౌన్స్ అవుతుందంటున్నారు. రియల్ ఏస్టేట్ అమ్మకాలు మళ్లీ సగటు స్థాయికి వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

దీనికి తోడు కోవిడ్‌ మొదటి దశ తర్వాత మధ్యతరగతి వర్గాలు సొంత ఇళ్లను సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. శివార్లలోని ఉప్పల్, మేడ్చల్, ఘట్‌కేసర్, పోచారం, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్, మహేశ్వరం, ఆదిభట్ల, బడంగ్‌పేట్, మణికొండ, శంకరపల్లి, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.

Read Also….  తెలంగాణలో కూడా కరోనాకు నాటుమందు.. రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించిన పోలీసులు!