
దేశంలోని రుణగ్రహీతలు, బ్యాంకు ఖాతాదారులకు ఊరటనిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ పలు కీలక మార్పులను అమల్లోకి తీసుకొస్తోంది. రుణాల ముందస్తు చెల్లింపులు, క్రెడిట్ స్కోర్ల అప్‌డేట్లు, నామినేషన్లకు సంబంధించిన కొత్త నిబంధనలు ఇప్పటికే దశలవారీగా అమలవుతున్నాయి. ఈ మార్పుల్లో కొన్ని గత ఏడాది నవంబరు నుంచే అమల్లోకి రాగా, మరికొన్ని ఈ ఏడాది జూలై మధ్య నుంచి అమల్లోకి రానున్నాయి. ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై తీసుకున్న రిటైల్ రుణాలకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మంజూరైన లేదా రెన్యువల్ చేసిన గృహ, వ్యక్తిగత, విద్య, వాహన రుణాలను ఇకపై ఎలాంటి ఫోర్‌క్లోజర్ చార్జీలు లేకుండానే ముందుగానే చెల్లించే అవకాశం కల్పించారు.
ఇప్పటి వరకు రుణాన్ని ముందుగా తీర్చాలంటే బ్యాంకులు అదనపు చార్జీలు వసూలు చేసేవి. కొత్త నిర్ణయంతో రుణగ్రహీతలు మిగులు నిధులు ఉన్నప్పుడు అప్పులు త్వరగా తీర్చేసి వడ్డీ భారాన్ని తగ్గించుకునే వీలు కలిగింది. క్రెడిట్ స్కోర్ల వ్యవస్థలో కూడా పెద్ద మార్పు తీసుకొచ్చారు. ప్రస్తుతం నెలకు ఒకసారి మాత్రమే అప్‌డేట్ అయ్యే క్రెడిట్ స్కోర్లు, జూలై 1 నుంచి వారానికి ఒకసారి అప్‌డేట్ కానున్నాయి. దీంతో EMIలు సమయానికి చెల్లించే వారి స్కోర్లు త్వరగా మెరుగుపడతాయి. అదే సమయంలో చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే దాని ప్రభావం కూడా వెంటనే స్కోరుపై పడనుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది రుణగ్రహీతల్లో ఆర్థిక క్రమశిక్షణను పెంచే అవకాశం ఉంది.
ఇక బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లాకర్ల నామినేషన్ ప్రక్రియలో కూడా ఆర్‌బీఐ సడలింపులు ఇచ్చింది. ఖాతాదారులు ఇప్పుడు ఒకేసారి లేదా విడతల వారీగా నలుగురు నామినీలను ఎంపిక చేసుకోవచ్చు. దీంతో ఖాతాదారుడు మరణించిన సందర్భంలో ఆస్తుల బదిలీ సులభతరం కానుంది. మరోవైపు నగల వ్యాపారులకు కూడా ఆర్‌బీఐ ఊరటనిచ్చింది. బంగారం హామీపై తీసుకునే రుణాల చెల్లింపు గడువును 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచింది. దీంతో వ్యాపారులకు నగదు నిర్వహణలో మరింత సౌలభ్యం లభించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి