RBI: ఇండియా సహా పలు దేశాల్లో వివిధ బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక సేవలు అందించే మల్టీనేషనల్ సంస్థ ‘మాస్టర్ కార్డ్’కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ షాకిచ్చింది. దీనిపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్ కార్డులపై ఆంక్షలు విధించింది. కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కార్డు నెట్‌వర్క్‌లో కొత్త కస్టమర్లను పొందకుండా నియంత్రణలు విధించింది. ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు జూలై 22 నుంచి అమలులోకి రానున్నాయి. అంటే జూలై 22 నుంచి మాస్టర్ కార్డు కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ కావు.పేమెంట్ సిస్టమ్స్ డేటా స్టోరేజ్‌కి సంబంధించి ఆర్‌బీఐ రూపొందించిన నిబంధనలను మాస్టర్ కార్డు అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
మాస్టర్ కార్డ్ కంపెనీకి తగినంత సమయం, అవసరమైన అవకాశాలు ఇచ్చినా కూడా.. ఆ సంస్థ పేమెంట్ సిస్టమ్ డేటా స్టోరేజ్ ఆదేశాలకు అనుసరించలేదని ఆర్బీఐ వెల్లడించింది. అందుకే ఆ కంపెనీ కార్యకలాపాలపై ఆంక్షలు విధించామని ఆర్బీఐ తెలిపింది. కాగా ఆర్బీఐ నిర్ణయం వల్ల ప్రస్తుత మాస్టర్ కార్డు కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడదని గమనించాలి. అయితే పౌరుల వ్యక్తిగత డేటాను మరింత సురక్షితం చేసేలా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసుల రంగానికి సంబంధించి మోదీ సర్కారు కొన్ని నిబంధనలను సవరించింది. దాని ప్రకారం.. దేశంలో ఆర్థిక సేవలు అందించే మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, వీసా కార్డ్ తదితర సంస్థలు ఇక్కడ జరిగే పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలనే నిబంధనను రూపొందించింది.
అయితే ఆర్బీఐ ఇచ్చిన గడువులోగా నిబంధనల పాలనలో విఫలం కావడంతో మాస్టర్ కార్డు పై ఆంక్షలు విధించారు. పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం 2007ను (పీఎస్‌ఎస్ చట్టం) అనుసరించి మాస్టర్ కార్డు సంస్థపై చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ కార్డులపైనా ఆర్‌బీఐ ఈ తరహా ఆంక్షలనే విధించింది.