
ఇటీవల ఎవరి చేతుల్లో చూసినా క్రెడిట్ కార్డు అనేది ఉంటుంది. ఆఫర్లు, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్ల కోసం దీనిని తెగ వాడేస్తున్నారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో వస్తువుల కొనుగోలు కోసం బాగా ఉపయోగిస్తున్నారు. ఇక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నగదు అవసరాలను తీరుస్తుందనే ఉద్దేశంతో క్రెడిట్ కార్డును ఉపయోగించేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే వీటి వినియోగం పెరిగేకొద్ది మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. క్రెడిట్ కార్డు మోసాలు ఇటీవల షరా మాములుగా జరుగుతున్నాయి. ఓటీపీ, కార్డు వివరాలు, స్పామ్ లింకుల ద్వారా క్రెడిట్ కార్డుల్లోని డబ్బులను కాజేస్తున్నారు. ఇటువంటి సమయంలో బాధితులు ఆర్ధికంగా నష్టాన్ని మూటకట్టుకుంటున్నారు. వీరికి అండగా నిలిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలపై బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
క్రెడిట్ కార్డు మోసాల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు కేవలం ఐదు రోజుల్లోనే రీఫండ్ అందించాలని బ్యాంకులకు ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఖాతాదారుడు ఫిర్యాదు చేసినా లేదా చేయకపోయినా బ్యాంకులు మోసపూరిత లావాదేవీని క్యాన్సిల్ చేసి రీఫండ్ ఇవ్వాలని స్పష్టం చేసింది. డిజిటల్ మోసాల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేస్తూ కొత్త నిబంధనలు విడుదల చేసింది. 2027 జనవరి 1వ తేదీ నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ లోపాలు, నిర్లక్ష్యంగా కారణంగా మోసం జరిగితే బ్యాంకులు ఐదు రోజల్లోగా సొమ్ము మొత్తం వెనక్కి ఇచ్చేయాలి. ఇక బ్యాంక్ లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగిన సమయంలో 5 రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఖాతాదారుడిపై ఎటువంటి బాధ్యత ఉండదు. 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే బ్యాంక్ పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు.
ఇక ఖాతాదారుడు ఫిర్యాదు చేశాక ఏమైనా అనధికార లావాదేవీలు జరిగితే బ్యాంకులే బాధ్యత తీసుకోవాలి. అందుకు కస్టమర్‌కు రీఫండ్ అందించాలి. ఇక క్రెడిట్ కార్డులో రీఫండ్ జమ చేసేటప్పుడు లావాదేవీ ఏ రోజు అయితే జరిగిందో అదే రోజు తేదీతో జమ చేయాలి. ఎలాంటి వడ్డీ, అదనపు ఛార్జీలు విధించకూడదు. తొలిసారి రూ.50 వేలలోపు సైబర్ మోసానికి 85 శాతం పరిహారం అందించాలి. జీవితంలో ఒకసారి మాత్రమే పరిహారం అందిస్తారు. ఇక ఖాతాదారుడు డిజిటల్ విధానంలో చేసే రూ.500కిపైగా ట్రాన్సాక్షన్లకు బ్యాంకులకు ఎస్‌ఎంఎస్‌లు పంపాలి. రూ.500లోపు లావాదేవీలకు బ్యాంకులు తమ అంతర్గత పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ఈ నిబంధనలను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నాయి.