గత కొంత కాలంగా సహకార బ్యాంకులపై సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. కొన్ని సహకార బ్యాంకులకు జరిమానా విధించడంతోపాటు పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేస్తోంది. ఈ క్రమంలో జూలై 4, 2024న బనారస్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేసింది. దీనితో పాటు, 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 7 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను ఆర్బీఐ రద్దు చేసింది. వారణాసిలోని బనారస్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లైసెన్స్‌ను రద్దు చేసింది. ఈ బ్యాంకు కార్యకలాపాలు జూలై 4, 2024 నుంచి నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది.
ప్రజల సొమ్ము ఏమవుతుంది?
ఉత్తరప్రదేశ్‌లోని కోఆపరేటివ్ కమీషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా బ్యాంకును మూసివేయడానికి, లిక్విడేటర్‌ను నియమించడానికి ఉత్తర్వు జారీ చేయాలని అభ్యర్థించారు. బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం, 99.98 శాతం డిపాజిటర్లు తమ మొత్తం డిపాజిట్లను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) నుండి స్వీకరించడానికి అర్హులు అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. లిక్విడేషన్ సమయంలో ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్లపై డిఐసిజిసి నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు. సహకార బ్యాంకుకు తగిన మూలధనం, సంపాదన సామర్థ్యం లేదని, దాని కొనసాగింపు దాని డిపాజిటర్ల ప్రయోజనాల కోసం కాదని ఆర్‌బిఐ పేర్కొంది.
రూ.4.25 కోట్లు చెల్లించారు
ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణంగా బ్యాంకు తన డిపాజిటర్లకు పూర్తి చెల్లింపులు చేయలేకపోతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఏప్రిల్ 30 వరకు బ్యాంకులోని సంబంధిత డిపాజిటర్ల నుండి స్వీకరించిన సుముఖత ఆధారంగా డిఐసిజిసి చట్టంలోని నిబంధనల ప్రకారం డిఐసిజిసి ఇప్పటికే మొత్తం బీమా డిపాజిట్లలో రూ.4.25 కోట్లను చెల్లించింది. బ్యాంక్ లైసెన్స్ రద్దు కావడం వల్ల బ్యాంక్ సేవలు నిలుపుదల అయ్యేలా చూడాలని ఆర్‌బీఐ ఇప్పటికే కోఆపరేటివ్ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సోసైటీస్‌కు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్ లిక్విడేటర్‌ను నియమించాలని తెలిపింది. కోఆపరేటివ్ బ్యాంక్ వల్ల సరిపడినంత మూలధనం లేదని, బ్యాంక్ సేవలను కొనసాగిస్తే.. కస్టమర్లపై ఇంకా ప్రతికూల ప్రభావం పడొచ్చని, అందుకే ఈ మేరకు బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి