రూ.వెయ్యి నోట్లు మళ్లీ వస్తున్నాయా..? అసలు విషయం ఇదే.. కేంద్రం నుంచి క్లారిటీ..
ఆర్బీఐ రూ,వెయ్యి నోటును మళ్లీ తీసుకురానుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీటిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఒక పోస్ట్ చేసింది.

నోట్ల రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి నోట్లను చలామణి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. వీటి స్థానంలో రూ.2 వేల నోట్లు తీసుకురాగా.. ఆ తర్వాత వాటిని కూడా చలామణి నుంచి ఉపసంహరించుకుంది. అయితే త్వరలో రూ.వెయ్యి నోట్లను ఆర్బీఐ మళ్లీ ప్రవేశపెట్టనుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. పసుపు రంగు, ఆలయం బొమ్మతో ఉన్న రూ.వెయ్యి నోట్లకు సంబంధించిన నకిలీ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. దీంతో ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు దీనిపై క్లారిటీ ఇస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.
“నకిలీ రూ.1,000 నోటు హెచ్చరిక. కొత్త రూ.1,000 నోటు జారీ చేయబడిందని పలు సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి. కొత్త రూ.1,000 నోటు జారీకి సంబంధించి ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆర్బీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సమాచారాన్ని అధికారిక మూలాల ద్వారా మాత్రమే ధృవీకరించుకోండి. ధృవీకరించని మార్గాల ద్వారా వచ్చే వార్తలను నమ్మకండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద కంటెంట్ కనిపిస్తే.. @PIBFactCheck హ్యాండిల్‌కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయండి. 8799711259 నెంబర్ లేదా factcheck@pib.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయండి” అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అయితే సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఆర్బీఐ కొత్తగా రూ.వెయ్యి నోటు తీసుకొచ్చిందంటూ ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. త్వరలోనే ఇవి బ్యాంకుల, ఏటీఎంలలో అందుబాటులోకి రానున్నాయంటూ చెబుతున్నారు. ఈ వీడియోలు కేవలం ఊహాజనిత ఎడిటెడ్ గ్రాఫిక్స్ మాత్రమేనని, వాటికి నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
రూ.వెయ్యి నోట్లను తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ ఎలాంటి సర్క్యూలర్ జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. ప్రజలు ఈ వార్తలను నమ్మి ఆందోళనకు గురి కావొద్దని స్పష్టం చేసింది. కేంద్రం, ఆర్బీఐ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అధికారికంగా ప్రకటన లేదా సర్క్యూలర్ రూపంలో ప్రకటిస్తుందని, అప్పుడు మాత్రమే ప్రజలు విశ్వసించాలని సూచించింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే మిగతా వార్తలను పట్టించుకవద్దని సూచించింది.
🚨 FAKE ₹1,000 NOTE ALERT!
Several social media posts claim that a new ₹1,000 note has been issued.
#PIBFactCheck
❌ This claim is fake.
✅ The @RBI has made no announcement regarding the issuance of a new ₹1,000 note.
🔸 Verify information through official sources and do not share unverified claims.
💡 Come across suspicious content related to the Central Government? Report it to @PIBFactCheck.
📲 +91 8799711259 📩 factcheck@pib.gov.in
— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2026
