Ratan Tata Passed Away: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా అంత్యక్రియలు పూర్తి

Srilakshmi C

| Edited By: Subhash Goud

Updated on: Oct 10, 2024 | 6:11 PM

బిజినెస్‌ టైకూన్‌, టాటా గ్రూప్స్‌ మాజీ ఛైర్మన్‌ రతన్ టాటా (86) బుధవారం అర్ధరాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు..

Ratan Tata Passed Away: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా అంత్యక్రియలు పూర్తి
Ratan Tata Passed Away

ముంబై, అక్టోబర్‌ 10: బిజినెస్‌ టైకూన్‌, టాటా గ్రూప్స్‌ మాజీ ఛైర్మన్‌ రతన్ టాటా (86) బుధవారం అర్ధరాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల భారత రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిషాతో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్‌ టాటా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో గురువారం నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్స్‌ సంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరించిన రతన్‌ టాటా.. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. రతన్‌ టాటా సేవలను గానూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ (2000), రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ (2008)తో సత్కరించింది. ఇదిలా ఉంటే..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Oct 2024 05:46 PM (IST)

    రతన్‌ టాటా అంత్యక్రియలు పూర్తి

    ప్రముఖ పారిశ్రామివేత్త రతన్‌ టాటా అంత్యక్రియలు ముంబైలోని వర్లీ శ్మశానవాటిక ముగిశాయి. కడసారిగా ప్రముఖులు రతన్‌ టాటాకు నివాళులు అర్పించారు.

  • 10 Oct 2024 05:33 PM (IST)

    రతన్‌ టాటా అంత్యక్రియలు కొనసాగుతున్నాయి.

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్లీ శ్మశానవాటికలో రతన్ టాటాకు నివాళులర్పించారు.

  • 10 Oct 2024 05:03 PM (IST)

    శ్వశాన వాటికకు చేరుకున్న రతన్‌ టాటా పార్థివ దేహం

    పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియల కోసం కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వర్లీలోని శ్మశానవాటికకు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో రతన్‌ టాటా అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు.

  • 10 Oct 2024 04:47 PM (IST)

    రతన్‌ టాటాకు కడసారి నివాళి అర్పించిన దిగ్గజాలు

    రతన్‌ టాటా పార్థివ దేహం ముంబైలోని ఎన్‌సీపీఏ నుంచి వర్లి శ్మశాన వాటికకు చేరుకుంది. కొద్దిసేపట్ల రతన్‌టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో నిర్వహించనున్న రతన్‌ టాటా అంత్యక్రిలు.. దిగ్గజాలు కడసారి నివాళులు అర్పించారు.

  • 10 Oct 2024 04:14 PM (IST)

    రతన్‌ టాటాకు సంతాపం తెలిపిన ఏపీ కేబినెట్‌

    రతన్‌ టాటా మృతిపై ఏపీ కేబినెట్‌ సంతాపం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రతన్‌ టాటా పార్థివదేహానికి నివాళులు అర్పించారు. భారతదేశం పెద్ద వ్యాపారవేత్త దిగ్గజాన్ని కోల్పోయిందని అన్నారు.

  • 10 Oct 2024 03:57 PM (IST)

    ప్రారంభమైన అంతిమయాత్ర

    కాసేపట్లో వర్లి శ్మశాన వాటికలో రతన్‌ టాటా అంత్యక్రియలు జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. ముంబైలోని ఎన్‌సీపీఏ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది.

  • 10 Oct 2024 03:35 PM (IST)

    రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి?

    ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటాకు భారత రత్న ఇవ్వాలని ఎఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రధానిని డిమాండ్ చేశారు. ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి భారత్‌ కోల్పోయిందన్నారు.

  • 10 Oct 2024 03:16 PM (IST)

    రతన్ టాటాకు అంబానీ కుటుంబం నివాళులు

    అంబానీ కుటుంబం రతన్ టాటాకు నివాళులర్పించింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ తదితరులు ఈ నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. దేశం ఒక మంచి వ్యాపారవేత్తను కోల్పోయిందని అన్నారు.

  • 10 Oct 2024 02:47 PM (IST)

    దేశానికి టాటా అందించిన సహకారం ఎంతో- ఆనంద్ మహీంద్ర

    రతన్‌ టాటా మరణం తీరని లోటని ఆనంద్ మహీంద్రా అన్నారు. అయన సలహా, మార్గదర్శకత్వం దేశానికి అమూల్యమైనదని అన్నారు. అతను పోయిన తర్వాత, మనం చేయగలిగేదల్లా ఆయన చూపిన ఆదర్శాన్ని అనుసరించడమేనని అన్నారు.

  • 10 Oct 2024 02:16 PM (IST)

    భారత్‌ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది – గౌతమ్‌ ఆదానీ

    భారతదేశం ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని, ఆధునిక భారతదేశ మార్గాన్ని పునర్నిర్వచించిన దార్శనికుడని గౌతమ్‌ ఆదానీ అన్నారు. రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడే కాదు, గొప్ప వ్యక్తి అని ఆదానీ తన ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయనలాంటి లెజెండ్‌లు చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

  • 10 Oct 2024 02:12 PM (IST)

    ఒక మంచి మిత్రున్ని కోల్పోయాం- అంబానీ

    ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతికి భారత ప్రముఖ పారిశ్రామికవేత్తలు బుధవారం సంతాపం తెలిపారు. రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ రతన్ టాటాను భారతదేశపు అత్యంత విశిష్టమైన, దాతృత్వ వ్యక్తిగా అభివర్ణించారు. ఒక మంచి మిత్రున్ని కోల్పోయినట్లు చెప్పారు.

  • 10 Oct 2024 01:22 PM (IST)

    రతన్‌ టాటా అంత్యక్రియలకు హాజరుకానున్న హోం మంత్రి అమిత్‌ షా..

    రతన్‌ టాటా అంత్యక్రియలకు హోం మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. మరికాసేపట్లో అమిత్‌ షా ముంబైకి చేరుకోనున్నారు. రతన్‌ టాటాకు కడసారి వీడ్కోలు పలికేందుకు పలువురు దిగ్గజాలు కదిలి వస్తున్నారు.

  • 10 Oct 2024 01:18 PM (IST)

    వర్లీ స్మశాన వాటికలో రతన్‌ టాటా అంత్యక్రియలకు ఏర్పాట్లు.. జన సంద్రంగా మారిన NCPA గ్రౌండ్

    రతన్‌ టాటాకు కడసారి నివాళులర్పించేందుకు జనాలు క్యూ కట్టారు. రాజకీయ, సినీ, వ్యాపార దిగ్గజాలు కదిలివచ్చారు. దీంతో NCPA గ్రౌండ్ జన సంద్రంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభంకానుంది.

  • 10 Oct 2024 01:14 PM (IST)

    రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’.. మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం

    రతన్ టాటా మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రతన్ టాటా కృషికిగానూ భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరే ప్రతిపాదనను కూడా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. కాగా దేశం గర్వించే వ్యాపారవేత్త రతన్‌ టాటాకు ‘భారత రత్న’ పురస్కారం ఇస్తే బాగుండేదని గతంలోనూ చర్చసాగింది. కానీ రతన్‌ టాటా మాత్రం అలాంటివాటిని సున్నితంగా తిరస్కరించేవారు. ‘భారతరత్న’ ఇవ్వాలని సోషల్ మీడియాలో జరుగున్న ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని మూడేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో ఆయన స్వయంగా పోస్టు చేసి, నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు కూడా.

  • 10 Oct 2024 12:06 PM (IST)

    రతన్ టాటాకు అంతిమ నివాళులు.. ముంబై బయల్దేరిన ఏపీ సీఎం చంద్రబాబు

    నేటి ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటికే ముగిసింది. రెగ్యులర్ అజెండాను మంత్రి మండలి వాయిదా వేసింది. రతన్ టాటాకు సంతాపం వరకే కేబినెట్ భేటీ పరిమితం చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబై బయల్దేరారు. ఆయన రతన్ టాటాకు అంతిమ నివాళులు ఆర్పించనున్నారు.

  • 10 Oct 2024 11:26 AM (IST)

    రతన్‌ టాటా మృతి పట్ల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం

    రతన్ టాటా.. ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజంగానే కాదు.. ఆయనో మానవతావాది కూడా.. రతన్ టాటా సక్సెస్ స్టోరీ ఎప్పటికీ యువతరాలకు స్ఫూర్తిదాయకమే. టాటా గ్రూప్‌ను ప్రజలకు మరింత చేరువు చేసి.. బిజినెస్‌పరంగా కంపెనీని మరింత ఉన్నతస్థాయిలో నిలిపింది రతన్ టాటా.

    • రతన్‌టాటా మృతిపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. రతన్‌టాటా జీవితం మొత్తం సమాజహితం కోసమే పనిచేశారన్నారు ప్రధాని మోదీ.భారత్‌ ఓ గొప్ప పారిశ్రామికవేత్తను కోల్పోయిందన్నారు ముర్ము. దూరదృష్టి ఉన్న వ్యాపారి అంటూ రతన్‌టాటాపై ప్రశంసలు కురిపించారు.
    • రతన్‌టాటా లాంటి విజన్‌ ఉన్న వ్యాపారవేత్త మృతి దేశానికి అపారనష్టమన్నారు రాహుల్‌గాంధీ. వ్యాపార రంగంలో ఆయన అడుగులు భవిష్యత్‌ తరాలకు ఆదర్శమన్నారు. కార్మికులను మానవతా కోణంలో చూసిన మంచి మనిషిగా కొనియాడారు శరద్‌ పవార్. దేశాభివృద్ధిలో గొప్పపాత్ర పోషించారన్నారు
    • రతన్‌టాటా వ్యాపార టైటాన్‌నే కాదు.. నిజమైన మానవతావాదిని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రతన్‌టాటాపై మృతి షాక్‌కు గురిచేసిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌. వ్యాపారిగా, మానవతావాదిగా రతన్‌టాటాను ప్రపంచం ఎన్నటికీ మరవబోదన్నారు. సక్సెస్‌కు ఆయన మారుపేరన్నారు.
    • రతన్‌టాటా మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపారు కేంద్రమంత్రులు జేపీనడ్డా, నితిన్‌ గడ్కరీ, ఒడిషా మాజీ సీఎం నవీన్‌పట్నాయక్. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన మృతి అన్నిరంగాలకు తీరని లోటన్నారు. ఆయన లేరనే వార్త చాలా బాధాకరమంటూ ఉద్వేగం చెందారు.
    • రతన్‌ టాటా మృతిపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎంలు మమత, యోగీ ఆదిత్యనాథ్‌. వ్యాపారిగానే కాకుండా సామాజిక సేవలో ముందున్న వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు.
    • ప్రముఖ యూనివర్సిటీలు ఆయన్ను అవార్డులతో సత్కరించేందుకు పోటీపడ్డాయి. పలుదేశాలకు చెందిన అత్యున్నత పురస్కారాలను సైతం దక్కించుకున్నారు. వ్యాపారరంగంలో ఆయన సేవలకు గాను 2000లో పద్మభూషణ్‌, 2008లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.
  • 10 Oct 2024 11:24 AM (IST)

    ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు రతన్‌ టాటా అంతిమయాత్ర ప్రారంభం

    ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భారత్‌ మరో కోహినూర్‌ వజ్రాన్ని కోల్పోయిందన్నారు మహరాష్ట్ర సీఎం షిండే. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. రతన్‌టాటా పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం NCPA గ్రౌండ్‌కు తరలించారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలకు రెడీ అయ్యింది మహరాష్ట్ర ప్రభుత్వం. మధ్యాహ్నం మూడున్నర గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆయన మృతికి నివాళిగా ఇవాళ సంతాపదినంగా ప్రకటించింది.

  • 10 Oct 2024 11:23 AM (IST)

    టాటా గ్రూప్‌లో రతన్‌ ప్రయాణం ఎలా మొదలైందంటే..

    టాటా గ్రూప్‌లో చేరిన వెంటనే రతన్‌ను పెద్ద పదవులు వరించలేదు. మొదట్లో ఓ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా పనిచేశాడు. అలా వివిధ టాటా గ్రూప్ వ్యాపారాలలో అనుభవం సంపాదించాడు. ఆ తర్వాత 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా నియమించబడ్డాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. టాటా గ్రూప్‌ సంస్థల్లో అనేక సంస్కరణలు చేపట్టాడు. ప్రతిభావంతులైన యువతను తీసుకురావడం ద్వారా వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నించారు. కొద్ది కాలంలోనే గ్రూప్‌లోని చాలా కంపెనీలు విజయానికి బాటలు పడ్డాయి. ఆ తర్వాత పదేళ్లకు టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ అయ్యారు. 1991లో తన మామ JRD టాటా తర్వాత టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. JRD టాటా ఐదు దశాబ్దాలకు పైగా ఈ పదవిలో ఉన్నారు. 1868లో ఒక చిన్న వస్త్ర వ్యాపార సంస్థగా ప్రారంభమైన టాటా గ్రూప్ ఆ తర్వాత ఉప్పు నుంచి ఉక్కు వరకు కార్ల వరకు, సాఫ్ట్‌వేర్, పవర్ ప్లాంట్లు, విమానయాన సంస్థల వరకు వ్యాపారాలు విస్తరించాయి. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ఎన్నో శిఖరాలను అధిరోహించింది.

  • 10 Oct 2024 11:17 AM (IST)

    IBM లో జాబ్ ఆఫర్ తిరస్కరించిన రతన్‌టాటా.. కారణం ఇదే

    ప్రపంచంలోని ఆరు ఖండాల్లో 100కుపైగా దేశాలలో టాటా సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఈ దేశాల్లో 30కిపైగా కంపెనీలను స్థాపించారు. రతన్ టాటా 1962లో న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్‌లో బిఎస్ డిగ్రీని పొందిన తర్వాత ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటైన IBM లో జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ రతన్‌ తన మామ JRD ఒత్తిడితో ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. టాటా వ్యాపారాలను రతన్‌ కొనసాగించాలని కోరడంతో.. వెంటనే రతన్‌ దేశానికి వచ్చి మామయ్య సలహా మేరకు టాటా గ్రూప్‌ ఆఫ్‌ సంస్థల్లో చేరాడు.

  • 10 Oct 2024 11:13 AM (IST)

    టాటా ట్రస్ట్‌కు 105 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. వైద్య, విద్యా రంగంలో ఎనలేని కృషి

    105 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో రతన్‌ టాటా అనేక అపూర్వమైన పనులు చేశారు. రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూప్, టాటా ట్రస్ట్‌లు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు క్యాన్సర్ వంటి వ్యాధులపై పోరాడేందుకు పెట్టుబడులు పెట్టారు. ఆయన సారథ్యంలో నిర్మించిన కేన్సర్‌ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ వైద్యశాలల్లో ఒకటిగా పేరుగాంచింది. ఎన్నో యేళ్లుగా రతన్ టాటా పతు సంస్థలు విద్యాసంస్థలకు బిలియన్ల కొద్దీ డాలర్లు విరాళంగా అందించారు. వీటిలో $70 మిలియన్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ, శాన్ డియాగో యూనివర్సిటీకి $50 మిలియన్లు విరాళంగా అందించారు.

  • 10 Oct 2024 11:07 AM (IST)

    టాటా గ్రూప్ చైర్మన్‌గా కంపెనీలను లాభాల బాటలో పరుగులు పెట్టించిన రతన్‌ టాటా

    22 ఏళ్లు టాటా గ్రూప్ చైర్మన్‌గా ఉన్న రతన్‌ టాటా తన కంపెనీలను లాభాల బాటలో పరుగులు పెట్టించారు. టాటా గ్రూప్స్‌ ఆదాయాలు 40 నుంచి 50 రెట్లు పెరిగాయి. 2011-12 సంవత్సరంలో మొదటిసారిగా $100 బిలియన్ల మార్కును దాటింది.

  • 10 Oct 2024 11:04 AM (IST)

    రతన్‌ టాటాకు క్వీన్ ఎలిజబెత్ II సత్కారం

    రతన్ టాటాను భారత ప్రభుత్వం మూడవ, రెండవ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్‌తో సహా అనేక పతకాలు, గౌరవాలతో సత్కరించారు. భారత్‌తోపాటు రతన్‌ టాటాను సింగపూర్, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు కూడా సత్కరించాయి. బ్రిటిష్ సామ్రాజ్యం అధినేత క్వీన్ ఎలిజబెత్ II కూడా రతన్‌ను గౌరవ నైట్ కమాండర్ బిరుదుతో సత్కరించారు.

  • 10 Oct 2024 10:59 AM (IST)

    టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్‌ టాటా రెండు సార్లు బాధ్యతలు

    1991లో JRD టాటా స్థానంలో టాటా గ్రూప్ మాతృ సంస్థ అయిన టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్‌ టాటా తొలిసారి నియమితుడయ్యాడు. అతను రెండుసార్లు ఈ పదవిలో ఉన్నారు. 1991 నుండి 2012 వరకు తొలిసారి, ఆ తర్వాత 2016 నుంచి 2017 వరకు రెండోసారి ఛైర్మన్‌గా వ్యవహరించారు.

  • 10 Oct 2024 10:57 AM (IST)

    రతన్ టాటాకు పదేళ్ల వయసున్నప్పుడు విడిపోయిన తల్లిదండ్రులు.. తండ్రికి రెండో పెళ్లి

    రతన్ టాటా డిసెంబర్ 28, 1937న జన్మించారు. అతను నావల్ టాటా పెద్ద కుమారుడు. స్వదేశంలో విద్యాభ్యాసం పూర్తైన తర్వాత న్యూయార్క్‌లోని ఐవీ లీగ్ సంస్థ కార్నెల్ నుంచి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పట్టా పొందాడు. రతన్ టాటాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు నావల్‌ టాటా- సోనీ టాటా విడిపోయారు. దీంతో రతన్‌ తన అమ్మమ్మ నవాజ్‌బాయి వద్ద పెరిగారు. ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం, నైతిక విలువలతో రతన్‌ను పెంచి పెద్ద చేసింది. అతను టెల్కో (ప్రస్తుతం టాటా మోటార్స్)లో తన కెరీర్‌ ప్రారంభించాడు. బ్లాస్ట్ ఫర్నేస్‌లో సున్నపురాయిని తవ్వే పని కూడా చేశాడు. సోనీ టాటాతో విడాకుల తర్వాత నావల్‌ టాటా రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య ద్వారా నోయెల్‌ టాటాకు జన్మనిచ్చారు. నోయెల్‌ టాటాకు మాయ, నెవిల్లే, లేహ్ టాటా.. అనే ముగ్గురు సంతానం ఉన్నారు.

  • 10 Oct 2024 10:48 AM (IST)

    రతన్‌ టాటాకు ఇష్టమైన కారు ఏదో తెలుసా?

    రతన్‌ టాటాకు కుక్కలంటేనే కాదు కార్లు కూడా మహా ఇష్టం. రతన్ టాటా గతంలో హోండా సివిక్‌లో ప్రయాణించేవారు. హోండా సివిక్ తర్వాత, రతన్ టాటా టాటా గ్రూప్‌కు చెందిన టాటా నెక్సాన్ ఈవీలో ప్రయాణించడం ప్రారంభించారు. ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌ కారును ఆయన వాడుతున్నారు. రతన్ టాటా గ్యారేజీలో ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వాటిల్లో టాటా నానో కారు ఆయనకు చాలా ఇష్టం. టాటా నానో అతని డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. టాటా నానో మాత్రమే కాదు 2023లో టాటా ఇండికా 25వ వార్షికోత్సవం సమయంలో రతన్ టాటా ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో టాటా ఇండికా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కారుగా పేర్కొన్నారు. ఈ కారు తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని కూడా తన పోస్టులో పేర్కొన్నారు.

  • 10 Oct 2024 10:44 AM (IST)

    ‘నేను జీవించి ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను…’ రతన్‌ టాటా ఎమోషన్‌ మాటలు

    రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కుక్కల పట్ల తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. తనకు కుక్కల పట్ల ఉన్న ప్రేమ లోతైనదని, తాను జీవించి ఉన్నంత వరకు ఈ ధోరణి కొనసాగుతుందని చెప్పాడు. రతన్‌ టాటాకు జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉందంటే.. జంతువుల కోసం ఏకంగా ఓ ఆసుపత్రే కట్టించాడు. దీనికి టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ అనే పేరు కూడా పెట్టారు. టాటా ట్రస్ట్స్ జంతు ఆసుపత్రిని 20 ఎకరాల్లో 165 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇది ఐదు అంతస్తుల భవనం.

  • 10 Oct 2024 10:37 AM (IST)

    ‘టాటా’లకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. ఆసక్తికర విశేషాలు

    రతన్ టాటా తండ్రి పేరు నావల్ టాటా. అయితే నావల్ టాటా కంటే ముందు అతని పూర్వికులెవరికీ ‘టాటా’ అనే ఇంటిపేరు లేదు. నావల్ టాటాకు 13 ఏళ్లు ఉన్నప్పుడు JN పెటిట్ పార్సీ అనాథాశ్రమంలో చదువుతుండగా అనుకోకుండా ఆయన పేరులో ‘టాటా’ చేరింది. 1917లో ప్రసిద్ధ పార్సీ పారిశ్రామికవేత్త, ప్రజా సేవకుడు జమ్‌సెట్‌జీ నసర్వాన్‌జీ టాటా కుమారుడు సర్ రతన్ టాటా, ఆయన భార్య నవాజ్‌బాయి ఆ అనాథ అశ్రమానికి వచ్చారు. అక్కడ ఆమె నావల్‌ని చూసింది. నవాజ్‌బాయికి నావల్ తెగ నచ్చేశాడు. అంతే.. అతనిని తన కొడుకుగా స్వీకరించింది. ఆ తర్వాత ‘నవల్’ టాటా కుటుంబంలో చేరి ‘నవల్ టాటా’ అయ్యాడు.

  • 10 Oct 2024 10:02 AM (IST)

    టాటా గ్రూప్ ఆప్‌ కంపెనీలకు తర్వాత వారసుడు ఎవరంటే..

    రతన్‌ టాటాకు సోదరులు లేరు. ఆయన తండ్రి నావల్ టాటా రెండో భార్య కుమారుడు నోయెల్ టాటా మాత్రమే ఇప్పుడు ఉన్నాడు. రతన్ టాటాకి సవతి సోదరుడైన ఈయనకు ముగ్గురు సంతానం. మాయ, నెవిల్లే, లేహ్ టాటా. వీరిలో ఒకరు టాటా గ్రూప్‌ సంస్థలకు వారసులయ్యే అవకాశం ఉంది.

  • 10 Oct 2024 09:59 AM (IST)

    పెళ్లి పీటలెక్కని నాలుగు ప్రేమలు.. బాలీవుడ్‌ నటితో రతన్ టాటా లవ్‌ ట్రాక్‌

    బాలీవుడ్ నటి సిమి గ్రేవాల్‌తో రతన్ టాటా కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిచింది. రతన్ టాటా నటి సిమి గ్రేవాల్‌ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. తాను నలుగురితో ప్రేమలో పడ్డానని, అయితే ప్రతిసారీ అదృష్టం కలిసిరాలేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రతన్ టాటా పెళ్లి చేసుకోవాలనుకున్న నటి సిమి గ్రేవాల్‌ కూడా పలుమార్లు వీరి లవ్‌ స్టోరీని మీడియాకు తెలిపారు. సిమి గ్రేవాల్ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో మాత్రమే కాకుండా, మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, జామ్‌నగర్ మహారాజు, వ్యాపారవేత్తతో కూడా లవ్‌ ట్రాక్‌ నడిపినట్లు తెలుస్తోంది.

  • 10 Oct 2024 09:38 AM (IST)

    జీవితాంతం రతన్‌టాటా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా?

    లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన రతన్ టాటాకు సొంత వారసులు లేరు. అందుకు కారణం ఆయన ఆజన్మ బ్రహ్మచారి. వయసులో ఉన్నప్పుడు అయకు వరుసగా నాలుగు సార్లు లవ్‌ ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించకుండా వ్యాపారంపై పూర్తి దృష్టి కేంద్రీకరించినట్లు ఓ ఇంటర్వ్యూలో రతన్‌ టాటా స్వయంగా తెలిపారు.

  • 10 Oct 2024 09:28 AM (IST)

    అమెరికాలో చదివినా.. సాధారణ ఉద్యోగిగా కెరీర్‌ ప్రారంభించిన రతన్‌ టాటా

    1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్‌ టాటా.. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్‌ టాటా.. 1962లో టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.

  • 10 Oct 2024 09:23 AM (IST)

    టాటా గ్రూప్‌ సంస్థలేకాదు అనేక స్టార్టప్‌ యాప్‌లను సైతం స్థాపించిన రతన్‌ టాటా

    టాటా గ్రూప్‌ను దాదాపు రెండు దశాబ్దాలకుపైగా కాలంలో ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. పారిశ్రామిక వేత్తగానే కాకుండా దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుంటారు. అనేక స్టార్టప్‌లను రతన్‌టాటా స్థాపించి, ప్రోత్సహించారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా యువతకు దిశానిర్ధేశం చేయడంలో ఆయన గొప్ప దార్శనికుడు అని చెప్పవచ్చు. ‘టాటా’ సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన గొప్ప వ్యాపార దిగ్గజంగా ఆయన నిలిచారు.

    Ratan Tata

    Ratan Tata

  • 10 Oct 2024 09:17 AM (IST)

    ‘దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త రతన్‌ టాటా’: ప్రధాని మోదీ సంతాపం

    రతన్‌టాటా మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీ, న అమిత్‌షా, రాజ్‌నాథ్‌, కిషన్‌రెడ్డితో సహా పలువురు సంతాపం తెలిపారు. భారత్‌ దిగ్గజ పారిశ్రామికవేత్తను కోల్పోయిందని రాష్ట్రనతి ముర్ము అన్నారు. దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త రతన్‌టాటా అని ప్రధాని మోదీ కొనియాడారు. సమాజహితం కోసం రతన్‌టాటా పనిచేశారని మోదీ అన్నారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రతన్‌టాటా వాణిజ్యరంగానికి ఆదర్శమూర్తి అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రతన్‌టాటా గొప్ప మానవతావాది అని కేటీఆర్ పేర్కొన్నారు.

  • 10 Oct 2024 09:14 AM (IST)

    మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్‌టాటా అంత్యక్రియలు

    రతన్‌టాటా మృతితో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం ఉ.10.30 గంటల నుంచి.. ముంబై-NCPA గ్రౌండ్‌లో రతన్‌టాటా భౌతికకాయం ఉంచనున్నట్లు రతన్‌ టాటా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • 10 Oct 2024 09:12 AM (IST)

    రతన్‌టాటాను పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌తో సత్కరించిన భారత ప్రభుత్వం

    నిరంతర స్వాప్నికుడు, అలుపెరుగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్‌టాటా తుదిశ్వాస విడిచారు. గొప్ప మానవతావాది కన్నుమూశారు. ఈ దేశం గర్వంగా చెప్పుకునే వ్యాపార సంస్థను నడిపించిన ఈ నాయకుడు, ఇక సెలవంటూ వెళ్లిపోయారు. ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం రెండు అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. 2000లో పద్మభూషణ్‌ అవార్డు, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది.

  • 10 Oct 2024 09:10 AM (IST)

    టాటా గ్రూప్‌ చైర్మన్‌గా రెండు దశాబ్ధాల కాలంపాటు రతన్‌ టాటా సేవలు

    1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌ చైర్మన్‌గా రతన్‌ టాటా సేవలు అందించారు. 2016-17 మధ్య తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. టాటా చారిటబుల్‌ ట్రస్టులకు కూడా రతన్‌టాటా చైర్మన్‌గా వ్యవహరించారు. అనేక స్టార్టప్‌లను ప్రోత్సహించిన రతన్‌టాటా.. దేశ పారిశ్రామిక, వాణిజ్యరంగ పురోగతిలో కీలకపాత్ర పోషించారు.

  • 10 Oct 2024 09:07 AM (IST)

    రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం

    దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. రతన్ టాటా వంటి వారి దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన వారు చాలా అరుదని అన్నారు. ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైటాన్‌నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయామని సీఎం చంద్రబాబు తెలిపారు.

  • 10 Oct 2024 09:05 AM (IST)

    ‘..యావత్ దేశానికి తీరని లోటు’ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం

    ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రతన్ టాటా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • 10 Oct 2024 09:02 AM (IST)

    ముంబైలోని NCPAలో రతన్‌ టాటా పార్థివ దేహం.. ప్రజల సందర్శనార్ధంఉదయం 10.30 గంటల నుంచి అనుమతి

    ప్రజల సందర్శనార్ధం రతన్‌ టాటా పార్థివ దేహాన్ని గురువారం ముంబైలోని ఎన్‌సీపీఏలో ఉదయం 10.30 గంటల నుంచి ఉంచనున్నారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార దిగ్గజాలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

  • 10 Oct 2024 08:57 AM (IST)

    నేడు మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో సంతాప దినం

    మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాలు గురువారం (అక్టోబర్‌ 10) సంతాప దినాలుగా ప్రకటించాయి. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎక్స్‌ వేధికగా తెలిపారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కూడా రాష్ట్రంలో ఒకరోజు సంతాప దినాలు ప్రకటించారు. జార్ఖండ్ వంటి వెనుకబడిన రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపును అందించిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ పద్మవిభూషణ్ రతన్ టాటా మృతికి రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సంతాపం ప్రకటించారు’ అని ‘X’లో ఒక పోస్ట్‌లో రాశారు.

  • 10 Oct 2024 08:54 AM (IST)

    శోకసంద్రంలో యావత్ దేశం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సంతాపం

    చాలా కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఐసీయూలో చేర్చారు. ఆయన మృతితో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

  • 10 Oct 2024 08:48 AM (IST)

    ప్రభుత్వ లాంఛనాలతో నేటి సాయంత్రం అంత్యక్రియలు

    ఈ రోజు సాయంత్రం రతన్ టాటా పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు.

Published On - Oct 10,2024 8:45 AM

Follow us
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!