Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వాహనదారులకు గుడ్‌న్యూస్. ఈ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ రోజు నుంచి అమ్మకాలు షురూ అవనున్నాయి. అయితే, ఈ స్కూటర్ కొనుక్కోవాలని.. మీరు ఓలా షోరూం కోసం వెతుకుతారేమో.. అది కుదరదు. ఎందుకంటే, ఈ వెహికిల్ అమ్మకాల ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. జూలై నెలలో ఓలా ఎలక్ట్రిక్ ప్రీ-లాంచింగ్ బుకింగ్‌లను ప్రారంభించింది. 24 గంటల్లో లక్ష బుకింగ్‌లు వచ్చాయి. మొత్తం చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్న కస్లమర్లకు కంపెనీ ఇప్పుడు విండోను తెరిచింది. కంపెనీ డైరెక్ట్-టు-హోమ్ సేల్స్ మోడల్‌ని కూడా అనుసరిస్తోంది. అంటే కొనుగోలుదారు ఫార్మాలిటీని పూర్తి చేసిన తర్వాత స్కూటర్‌ను నేరుగా ఇంటికే డెలివరీ చేస్తారు.
ఈఎంఐ ఆప్షన్
ఓలా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉండేందుకు పలు బ్యాంకులతో ఓలా సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ మహీంద్రా ప్రైమ్, టాటా క్యాపిటల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, జన స్మాల్ ఫైనాన్స్, వంటి పలు బ్యాంకింగ్ , ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా కనీస ఈఎంఐ రూ. 2,999గా నిర్ణయించారు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎస్ 1, ఎస్ 1 ప్రో అంటూ రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. వీటిలో 8.5 కిలోవాట్ మోటార్, 3.97 కిలోవాట్ పర్ అవర్ బ్యాటరీని అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 నుంచి 115 కిలోమీటర్లుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు, కేవలం మూడు సెకన్లలో 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. ఇందులో ఎస్ 1 ధర రూ. 99,999లుగా ఉండగా ఎస్ 1 ప్రో ధర రూ.1,29,000లుగా ఉన్నాయి. ఓలా స్కూటర్ పది రంగుల్లో లభిస్తోంది.