Punjab National Bank: ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేషనల్ ఛార్జీల బాదుడు ప్రారంభించింది. ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) ఈ-మాండేట్ ధృవీకరణ, తక్షణ చెల్లింపు సేవ (IMPS) వినియోగంతో పాటు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT) లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలను పెంచేసింది. మే 20న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బ్యాంక్ ఇప్పుడు RTGS, NEFT, NACH eMandate, IMPS లావాదేవీలపై సవరించిన సేవా ఛార్జీలను వసూలు చేస్తోంది.
RTGS ఛార్జీలు..
గతంలో రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల స్లాబ్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ లో రూ. 20, ఆన్‌లైన్ RTGS లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలను వసూలు చేసేదికాదు. ఇప్పుడు బ్రాంచ్‌లో రూ. 24.50, ఆన్‌లైన్ లావాదేవీలకు రూ. 24 వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షలకు పైబడిన లావాదేవీల కోసం.. సర్వీస్ ఛార్జీని శాఖలో రూ. 49.50, ఆన్‌లైన్ లావాదేవీలకు రూ. 49 వసూలు చేయనున్నట్లు వినియోగదారులకు వెల్లడించింది.
NEFT ఛార్జీలు..
గతంలో PNB శాఖలో రూ.10 వేల వరకు జరిపై లావాదేవీలపై రూ. 2, NEFT లావాదేవీలపై ఆన్‌లైన్ లావాదేవీ ఛార్జీలు సున్నా రూపాయలు వసూలు చేసేది. దీన్ని ఇప్పుడు బ్రాంచ్‌లో రూ.2.25కి, ఆన్‌లైన్ లావాదేవీలకు రూ.1.75కి పెంచుతున్నట్లు తెలిపింది. రూ.10,000 కంటే ఎక్కువ నుంచి రూ.1 లక్ష వరకు లావాదేవీలపై సేవా ఛార్జీల కోసం.. బ్యాంక్ గతంలో బ్రాంచ్ లో రూ. 4, ఆన్‌లైన్‌లో సున్నా రూపాయలను వసూలు చేసింది. కానీ.. ఇప్పుడు ఆ ఛార్జీలు బ్రాంచ్‌లో రూ. 4.75, ఆన్‌లైన్ లావాదేవీలకు రూ. 4.25గా నిర్ణయించింది. ఇదే సమయంలో.. రూ.లక్ష కంటే ఎక్కువ నుంచి రూ.2 లక్షల వరకు జరిపై లావాదేవీలకు గతంలో బ్రాంచ్‌లో రూ.14, ఆన్‌లైన్‌లో సున్నా రూపాయలను సర్వీస్ ఛార్జీలు వసూలు చేసిన బ్యాంకింగ్ దిగ్గజం.. ఇప్పుడు వాటిని బ్రాంచ్ లో రూ.14.75, ఆన్ లైన్ బదలాయింపుకు రూ.14.25గా నిర్ణయించింది. తాజాగా పెంచిన ఛార్జీలతో వినియోగదారులకు ఇకపై బ్యాంకింగ్ సేవలు మరింత ప్రియం కానున్నాయి.