EPF Account: మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉందా..? అందులో ప్రతి నెల డబ్బులు జమ చేస్తున్నారా? మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందించే అన్ని బెనిఫిట్స్ గురించి తెలుసా? ఈ బెనిఫిట్స్‌లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కూడా ఉంది. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులు కుటుంబానికి రూ.7,00,000 బెనిఫిట్ లభిస్తుంది. ఇది ఇన్స్యూరెన్స్ స్కీమ్. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు అందరూ ఈ స్కీమ్‌లో కవర్ అవుతారు. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు రూ.7,00,000 బీమా వర్తిస్తుంది. ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్ కొనసాగిస్తున్న సమయంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.7,00,000 బీమా అందుతుంది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా రూ.7,00,000 వరకు బీమా పొందాలంటే ఉద్యోగులు ఇ-నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే నామినీ వివరాలను ఈపీఎఫ్ అకౌంట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే నామినీ వివరాలు ఎంటర్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ ఇ-నామినేషన్ ద్వారా ఇది సాధ్యం. ఈపీఎఫ్ మెంబర్స్ అందరూ ఇ-నామినేషన్ ఫైల్ చేసి తమ కుటుంబాలకు సామాజిక భద్రత అందించాలని ఈపీఎఫ్ఓ కూడా కోరుతోంది. ఈపీఎఫ్ లేదా ఈపీఎస్ నామినేషన్ డిజిటల్ పద్ధతిలో పూర్తి చేయాలని కోరుతోంది.
ఈపీఎఫ్ ఖాతాదారులు ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి. సర్వీస్ (Services) పైన క్లిక్ చేయాలి. అందులో ఫర్ ఎంప్లాయీస్ (For Employees) సెక్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు Member UAN/Online Service ఆప్షన్ ఓపెన్ అవుతుంది.
మెంబర్ ఇ-సేవా పోర్టల్ ఓపెన్ తర్వాత ఉద్యోగులు యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Manage ట్యాబ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో E-Nomination సెలెక్ట్ చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలు ఎంటర్ చేయాలి. మీ నామినీగా ఎవరిని ఎంచుకుంటే వారి వివరాలు ఎంటర్ చేయాలి. Add Family Details క్లిక్ చేసి పేర్లు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఒకరు లేదా ఒకరి కన్నా ఎక్కువమంది పేర్లు ఎంటర్ చేయవచ్చు. ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా వివరించవచ్చు.
వివరాలన్నీ ఓసారి సరిచూసుకున్న తర్వాత Save EPF Nomination పైన క్లిక్ చేయాలి. తర్వాతి పేజీలో E-sign ఆప్షన్ క్లిక్ చేయాలి. వన్ టైమ్ పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది. మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా రూ.2,00,000 నుంచి రూ.6,00,000 మధ్య బీమా లభించేది. ఇటీవల ఈ స్కీమ్ బెనిఫిట్‌ను పెంచింది ఈపీఎఫ్ఓ. కనీసం రూ.2,50,000 నుంచి గరిష్టంగా రూ.7,00,000 వరకు బీమా పొందే అవకాశం ఉంటుంది.