Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో భారత్ ఆటో పరిశ్రమకు మంచి అవకాశం ఎందుకంటే..

|

Mar 09, 2022 | 6:40 PM

రష్యా, ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపింది. ఇదిలా ఉంటే త్వరలో భారతదేశంలోని కార్ల కొనుగోలుదారులకు శుభవార్త రాబోయే అవకాశం ఉంది...

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో భారత్ ఆటో పరిశ్రమకు మంచి అవకాశం ఎందుకంటే..
Follow us on

రష్యా, ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపింది. ఇదిలా ఉంటే త్వరలో భారతదేశంలోని కార్ల కొనుగోలుదారులకు శుభవార్త రాబోయే అవకాశం ఉంది. రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచంలోని పెద్ద కార్ల కంపెనీలు అక్కడ తమ వ్యాపారాన్ని మూసివేయడానికి సన్నాహాలు ప్రారంభించాయి. రష్యాలో ఉత్పత్తి నిలిపివేయడంతో అక్కడ కార్ల పరిశ్రమలో ఉపయోగించే సెమీకండక్టర్లను భారతదేశం వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రపంచ మార్కెట్‌లకు రవాణా చేయవచ్చు. తమ కారు లేదా SUV డెలివరీ కోసం చాలా కాలం వేచి ఉండాల్సిన భారతదేశంలోని కస్టమర్లకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. సెమీకండక్టర్ లేదా చిప్ అనేది ఆధునిక వాహనాల్లో ఉపయోగించే ముఖ్యమైన భాగం. ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు హ్యుందాయ్, స్కోడా, కియా, వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ మొదలైనవి భారతదేశంలో ఉత్పత్తి చేస్తాయి. రష్యాలో ఉత్పత్తి ఆగిపోవడంతో, ఈ కంపెనీల భారతీయ యూనిట్లకు సెమీకండక్టర్ చిప్‌ల సరఫరాను వేగవంతం చేయవచ్చు.. దీని కారణంగా వాటి ఉత్పత్తి వేగవంతం అవుతుంది.

సెమీకండర్ల కొరత కారణంగా ఆటోమొబైల్‌ రంగా గత సంవత్సరం నుంచి సమస్యలు ఎదుర్కొంటుంది. వాహనాలు మొదలుకుని కంప్యూటర్లు, సెల్‌ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో సెమీకండక్టర్లుగా వ్యవహరించే సిలికాన్‌ చిప్‌లను వాడుతున్నారు. ఆయా ఉత్పత్తులు సక్రమంగా పనిచేసేందుకు చిప్‌లు ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో బ్లూటూత్‌ కనెక్టివిటీ, డ్రైవర్‌ అసిస్ట్, నేవిగేషన్, హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ సిస్టమ్స్‌ లాంటి అధునాతన ఎలక్ట్రానిక్‌ ఫీచర్లతో కొత్త వాహనాల రూపకల్పనలో సెమీకండక్టర్ల వాడకం ఎక్కువైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా గతేడాది చివరిలో సెమీ కండక్టర్ల కొరత తలెత్తింది. కరోనా మహమ్మారి వల్ల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాల్సి రావడంతో ఉన్నపళంగా ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల డిమాండ్‌ పెరిగింది. ఆ సమయంలోనే కొవిడ్‌ కేసులు ఎక్కువవుతుండటంతో చాలా దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేశాయి. దాంతో ఉత్పత్తి, సరఫరాలో సమస్యలు తలెత్తాయి. చిప్స్‌ కొరతతో మన దేశంలోనే 169 పరిశ్రమలకు ఇబ్బంది పడుతున్నాయి. దేశీయంగా కంప్యూటర్ల, లాప్‌టాప్‌ల లభ్యతపై 5 నుంచి 10శాతం మేర ప్రభావం పడింది.

Read also.. Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 1,223, నిఫ్టీ 332 పాయింట్లు అప్.. జెలెన్‌స్కీ ప్రకటనే కారణమా..