Interest Rate Hike: రెపో రేటు పెంపు తరువాత బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో.. మరో ప్రైవేట్ రంగ బ్యాంక్ డిసిబి తన వడ్డీ రేట్లలో కీలక మార్పులు చేసింది. మే 21, 2022 నుంచి రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న రెసిడెంట్ ఇండియన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును బ్యాంక్ సవరించింది. గతంలో బ్యాంక్ 7 నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 4.35 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేసింది. అయితే.. ఈ రేటును 45 బేసిస్ పాయింట్ల మేర పెంచి 4.80 శాతానికి చేర్చింది. DCB బ్యాంక్ 91 రోజుల నుంచి 6 నెలల లోపు మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.05 శాతం నుంచి 5.50 శాతానికి పెంచింది.
6 నెలల నుంచి 12 నెలల లోపు కాల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లపై, బ్యాంక్ వడ్డీ రేటును 45 బేసిస్ పాయింట్లు అంటే 5.25 శాతం నుంచి 5.7 శాతానికి పెంచింది. అయితే.. 12 నెలల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేటును 6 శాతానికి పెంచింది. DCB బ్యాంక్ ఇప్పుడు 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. గతంలో 12 నెలల నుంచి 15 నెలల కంటే తక్కువ డిపాజిట్లపై 5.30 శాతం వడ్డీ చెల్లిస్తోంది. గతంలో 15 నుంచి 18 నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 6% ఉండగా.. దానిని 10 బేసిస్ పాయింట్లు పెంచి 6.10 శాతానికి చేర్చింది.
DCB బ్యాంక్ ఇప్పుడు 18 నెలల నుంచి 36 నెలల కంటే తక్కువ కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అంతకు ముందు ఇది 6.25 శాతం ఉండగా.. తాజాగా బ్యాంక్ మరో 25 బేసిస్ పాయింట్లను పెంచింది. కాగా.. 36 నుంచి 120 నెలల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటును 6.25 శాతం నుంచి 6.60 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్‌లు అన్ని కాల వ్యవధులు ఉండే డిపాజిట్లపై సాధారణ రేటు కంటే 0.50 శాతం అదనపు ప్రయోజనాన్ని బ్యాంక్ కొనసాగిస్తోంది. వడ్డీ రేట్ల సవరణ వల్ల 7 రోజుల నుంచి 120 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఇప్పుడు సీనియర్ సిటిజన్‌లు 5.30 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ రేట్లు పొందుతారు. DCB బ్యాంక్ మే 19, 2022న తన సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను సైతం సవరించింది. దీని ఫలితంగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై గరిష్ఠంగా 6.75 శాతం రేటును అందిస్తోంది.