NPS: పదవీ విరమణ చేసిన తరువాత జీవితానికి అవసరమైన ఆర్ధిక భద్రత కోసం నేషనల్ పెన్షన్ స్కీం(NPS)లో పెట్టుబడి ఒక మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అంతేకాదు.. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలని భావించినపుడు కూడా ఎన్పీఎస్ లో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా, సురక్షితంగా ఉంటుంది. ఇలా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం ప్రారంభించాకా.. ఎపుడైనా అత్యవసర పరిస్థితి వచ్చి.. డబ్బు అవసరం అయినపుడు ఎన్పీఎస్ నుంచి ముందస్తు ఉపసంహరణ ద్వారా సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. అయితే, దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా ఎన్పీఎస్ నుంచి ఎపుడైనా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎన్పీఎస్(NPS)లో రెండు రకాల పెట్టుబడి విధానాలు ఉన్నాయి. అవి మొదటిది టైర్-1 కాగా రెండో టైర్-2 ఖాతా. వీటిలో టైర్-2 ఖాతా మధ్యలో ఎన్పీఎస్ నుంచి బయటకు వచ్చేయలని కోరుకునే వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.
ఉపసంహరణల కోసం పీఎఫ్ఆర్డీఏ(PFRDA) సగటు నియమం 80:20. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఎవరైనా 18-60 సంవత్సరాల మధ్య ఎన్పీఎస్(NPS)లో చేరి, అకాల ఉపసంహరణ చేస్తే, అప్పుడు ఫండ్‌లో 20 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. 80 శాతం పెన్షన్ స్కీమ్ కొనుగోలుకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మేరకు సెప్టెంబర్‌లో పెన్షన్ రెగ్యులేటర్ పీఎఫ్‌ఆర్‌డీఏ సర్క్యులర్ జారీ చేసింది.
2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కార్పస్ పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు
సెప్టెంబరు 21, 2021న పీఎఫ్ఆర్డీఏ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, పెన్షన్ ఫండ్ కార్పస్ 2.5 లక్షల కంటే తక్కువ ఉంటే, మొత్తం మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం, 60 ఏళ్ల తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుండి ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఇంతకంటే ముందుగా బయటకు వచ్చేయడాన్ని ప్రీ-మెచ్యూర్ ఎగ్జిట్ అంటారు.
5 లక్షల వరకు పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు
మీరు 60 ఏళ్లు పూర్తయిన తర్వాత, కార్పస్ 5 లక్షల వరకు ఉంటె కనుక.. మొత్తం అంతా ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే కార్పస్ 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, గరిష్టంగా 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు, అయితే మిగిలిన 40 శాతం పెన్షన్ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.
చందాదారుడు మరణిస్తే..
ఒకవేళ చందాదారుడు మరణిస్తే, నామినీకి మొత్తం అందుతుంది. సబ్‌స్క్రైబర్ ప్రభుత్వ ఉద్యోగి అయితే కార్పస్ 5 లక్షల కంటే తక్కువ ఉంటే, అప్పుడు నామినీ ఆ మొత్తాన్ని ఒకేసారి పొందుతారు. అయితే, కార్పస్ 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, కార్పస్‌లో 80 శాతం పెన్షన్ కోసం ఉపయోగిస్తారు. మిగిలిన 20 శాతాన్ని ఏకమొత్తంలో ఇస్తారు.
ఇవి కూడా చదవండి: Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!