
మనుషుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్, స్కానింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగిస్తారు. ఇప్పుడు అదే తరహాలో రోడ్లపై ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా పరీక్షించే ఆధునిక వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెడుతున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ అఫ్ ఇండియా (NHAI) రహదారుల నాణ్యతను గుర్తించేందుకు NSV (నెట్వర్క్ సర్వే వెహికల్) అనే హైటెక్ వాహనాన్ని ఉపయోగించేందుకు సిద్ధమైంది. రోడ్లలో ఉన్న పగుళ్లు, గుంతలు, అరుగుదల వంటి లోపాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం దీని ప్రత్యేకత.
రోడ్డు భద్రతా నిపుణుడు అనురాగ్ కులశ్రేష్ఠ తెలిపిన వివరాల ప్రకారం ఈ సాంకేతికత ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాల్లో వినియోగంలో ఉంది. ఇప్పుడు భారతదేశంలో కూడా రహదారి భద్రతను మెరుగుపరచేందుకు దీనిని ఉపయోగించనున్నారు. సాంప్రదాయ పద్ధతిలో రోడ్డు సర్వే చేయాలంటే పలువురు సిబ్బంది కలిసి రోజుకు సుమారు 80 కిలోమీటర్ల మేర మాత్రమే తనిఖీ చేయగలరు. కానీ NSV సహాయంతో రోజుకు దాదాపు 300 కిలోమీటర్ల వరకు రహదారులను సర్వే చేయవచ్చు. అంతేకాదు కేవలం 1 మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్న చిన్న పగుళ్లను కూడా ఈ వ్యవస్థ గుర్తించగలదు.
ఈ NSV వాహనంలో అత్యాధునిక సెన్సార్లు, లేజర్ ప్రొఫైలోమీటర్లు, హై-రిజల్యూషన్ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఇవి వాహనం సాధారణ వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ రహదారి ఉపరితలాన్ని పూర్తిగా స్కాన్ చేస్తాయి. రోడ్డుపై ఉన్న ఎగుడుదిగుడులు, గుంతలు, పగుళ్లు, గరుకుదనం వంటి అంశాలను ఖచ్చితంగా కొలుస్తాయి. అంతేకాకుండా ఈ వాహనంలో 360 డిగ్రీల కెమెరా వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా రోడ్డుకు కుడి, ఎడమ, ముందు, కింద భాగాల చిత్రాలు, 3D డేటా సేకరించబడుతుంది. DGPS సాంకేతికత ద్వారా రహదారి యొక్క ఖచ్చితమైన భౌగోళిక స్థానం కూడా నమోదు అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లేజర్ టెక్నాలజీ సహాయంతో రోడ్డుపై ఉన్న లోపాలను స్వయంచాలకంగా గుర్తించే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది.
NSV సేకరించిన సమాచారం నేరుగా కమాండ్ సెంటర్‌కు చేరుతుంది. అక్కడ డేటాను విశ్లేషించి రహదారికి మరమ్మతులు అవసరమా లేదా అన్నది నిర్ణయిస్తారు. అన్ని ప్రక్రియలు డిజిటల్‌గా నమోదు కావడంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సాంకేతికత అవసరం మరింత పెరిగింది. గణాంకాల ప్రకారం 2025 తొలి అర్ధభాగంలో దేశంలో సుమారు 1.8 లక్షల రోడ్డు ప్రమాద మరణాలు నమోదయ్యాయి. అందులో 29 వేలకుపైగా జాతీయ రహదారులపైనే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 18-45 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రహదారులు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ అత్యంత కీలకంగా మారాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి