Home Loan: హోం లోన్ తీసుకుంటున్నారా? బ్యాంకులు దాచిపెట్టే “స్ప్రెడ్” రహస్యం ఇదే.. ఇంత కథా ఉందా..

స్ప్రెడ్.. ఈ పదే చాలమంది వినే ఉండరు. హోం లోన్ తీసుకునేవారు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. దీని గురించి అవగాహన లేకపోతే భారీ నష్టపోవాల్సి ఉంటుంది. అసలు స్ప్రెడ్ అంటే ఏంటి.. దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.

Home Loan: హోం లోన్ తీసుకుంటున్నారా? బ్యాంకులు దాచిపెట్టే స్ప్రెడ్ రహస్యం ఇదే.. ఇంత కథా ఉందా..
Home Loan

Updated on: Jun 24, 2026 | 12:13 PM

సొంతింటి కలను సాకారం చేసుకోవాలనేది ప్రతీఒక్క సామాన్య, మధ్యతరగతి ప్రజల కల. ఇందుకోసం తమ శ్రమను ధారగా పోసి కష్టపడుతుంటారు. ఇవి సరిపోక బ్యాంక్ నుంచి హోం లోన్ తీసుకుంటుంటారు. ఇటువంటి సమయంలో ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయనేది చెక్ చేసుకుంటారు. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉంటే ఆ బ్యాంకులో తీసుకోవడం వల్ల మీకు డబ్బులు ఆదా అవుతాయి. హోం లోన్ అనగానే మొదటగా చూసేది వడ్డీ రేటునే గురించే. ఒక్కొ బ్యాంక్ ఒక్కొలా వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఒక బ్యాంకు 8.2 శాతం, మరో బ్యాంకు 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తే.. మనం తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకునే ఎంచుకుంటాము. వాస్తవానికి ఈ వడ్డీ రేట్ల వెనుక ఒక ముఖ్యమైన అంశం దాగి ఉంది. అదే ‘స్ప్రెడ్’. దీని గురించి చాలామందికి తెలియక నష్టపోతున్నారు. అసలు స్ప్రెడ్ అంటే ఏంటి? అనేది చూద్దాం.

స్ప్రెడ్ అంటే ఏంటి?

హోం లోన్లకు సంబంధించి ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు ఆర్బీఐ రెపో రేటు బేస్ రేటుకు అనుసంధానించబడి ఉంటాయి. బ్యాంకులు, ఈ బేస్ రేటుకు తమ ‘స్ప్రెడ్’ను జోడించి కస్టమర్‌కు తుది వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. బ్యాంకుకు లభించే లాభ మార్జిన్‌నే స్ప్రెడ్ అంటారు. బేస్ రేటు 6 శాతం, బ్యాంకు స్ప్రెడ్ 2.5 శాతంగా ఉంటే.. మీరు చెల్లించాల్సిన వడ్డీ రేటు 8.5 శాతం అవుతుంది. ఈ స్ప్రెడ్ అందరికీ ఒకేలా ఉండదు. కస్టమర్ క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఉపాధి, రుణ మొత్తం, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి స్ప్రెడ్ నిర్ణయిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయ స్థిరత్వం ఉంటే తక్కువ స్ప్రెడ్‌తో రుణం పొందవచ్చు. అధిక ఆర్థిక రిస్క్ ఉన్న వ్యక్తికి అధిక స్ప్రెడ్ రేటును బ్యాంకులు నిర్ణయిస్తాయి. అదే క్రెడిట్ స్కోర్ బాగుంటే తక్కువ స్ప్రెడ్ రేటు వల్ల మీరు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.హోం లోన్ తీసుకునేముందు కేవలం వడ్డీ రేటు, నెలవారీ EMI ఎంత అని అడిగితే సరిపోదు. బ్యాంకు ఉపయోగించే బేస్ రేటు ఎంత..? ఎంత స్ప్రెడ్ కలుపుతారు? తర్వాత ఈ స్ప్రెడ్ పెరుగుతుందా? అనే విషయాలను కూడా తెలుసుకోవాలి.

సంతకాలు పెట్టేముందు..

స్ప్రెడ్ రేటు ఎక్కువగా ఉంటే నెలవారీ చెల్లింపులలో ఒక చిన్న పెరుగుదల మాత్రమే అనుకుంటారు. కానీ రుణాన్ని 20 లేదా 25 సంవత్సరాల పాటు కొనసాగించినప్పుడు ఈ చిన్న తేడా పెద్దదిగా అనిపిస్తుంది. EMIల రూపంలో వేల, లక్షల రూపాయల అదనపు భారం అవుతుంది. అందుకే హోం లోన్ పేపర్లపై సంతకాలు పెట్టే సమయంలో గుడ్డిగా చేయకండి. డాక్యుమెంట్లు, వడ్డీ రేట్లు అన్నీ చదవండి. స్ప్రెడ్ గురించి బ్యాంకును అడిగి తెలుసుకోండి. ఆ తర్వాతనే సంకతాలు పెట్టండి.

 

Follow Us