
ఈ-పాన్ కార్డు డౌన్ లోడ్ అంటూ వచ్చే మెయిల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రెస్ ఇన్పర్మేషన్ బ్యూరో(PIB) హెచ్చరించింది. ఈ మేరకు పీఐబీ తన ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టింది. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఈ-పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండి అంటూ నకిలీ మెయిల్స్ పంపిస్తున్నారు. కొంతమందికి తెలియక ఈ లింకులను క్లిక్ చేస్తున్నారు. ఇలాంటి మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్లిక్ చేయవద్దని పీఐబీ స్పష్టం చేసింది. ఈ మెయిల్స్ అన్నీ ఫిషింగ్ ప్రక్రియలో ఓ భాగమని, ఇలాంటి మెయిల్స్‌ను అసలు పట్టించుకోవద్దని స్పష్టం చేసింది.
“మీకు e-PAN కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అడుగుతూ ఒక ఇమెయిల్ కూడా వచ్చిందా? ఆ ఇమెయిల్ నకిలీదని అర్ధం చేసుకోండి. ఆర్థిక, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని అడిగే ఏవైనా ఇమెయిల్‌లు, లింక్‌లు, కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లకు ప్రతిస్పందించవద్దు. ఫిషింగ్ ఇ-మెయిల్‌లను రిపోర్ట్ గురించి వివరాలు కోసం https://incometaxindia.gov.in/pages/report-phishing.aspx ” అంటూ పోస్ట్ చేసింది. సైబర్ క్రిమినల్స్ హానికరమైన లింక్‌లను క్లిక్ చేసేందుకు లేదా ఇన్‌ఫెక్టెడ్ ఫైల్స్‌ను డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ మెయిల్స్ ఉపయోగిస్తారని హెచ్చరించింది. ఈమెయిల్ క్లిక్ చేస్తే వ్యక్తిగత, ఆర్ధిక డేటాను చోరీ చేస్తారని, మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారాన్ని మాల్వేర్ పరికరాల సాయంతో సేకరిస్తారని తెలిపారు. కాగా పాన్ కార్డు అనేది ప్రతీఒక్కరూ వినియోగిస్తూ ఉంటారు. దీంతో పాన్ కార్డు అని కనిపిస్తే ఎవరైనా క్లిక్ చేస్తారు. దీనిని ఆసరాగా ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. నకిలీ లింకులతో బురిడీ కొట్టించి డబ్బులను కొల్లగొడుతున్నారు. ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను చోరీ చేస్తున్నారు. మార్చి 8వ తేదీన పీఐబీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ పోస్టు పెట్టింది. ఇలాంటి నకిలీ లింకులను నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించింది.