AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

లీటర్ పెట్రోల్ వంద దాటేయడంతో బండి తీయాలంటేనే సామాన్యుడు భయపడిపోతున్న రోజులివి. కానీ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో పెట్రోల్ ధర ఎంతో తెలుసా? ఒక్క రూపాయి నోటు ఇస్తే ఎంత పెట్రోల్ ఇచ్చేదో తెలిస్తే మీరు అవాక్కవుతారు. 1947 నాటి ఆ ఆసక్తికరమైన ధరలు, కాలక్రమేణా పెట్రోల్ రేట్లు సెంచరీ ఎలా కొట్టాయి అనేది తెలుసుకుందాం..

1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Petrol Price In 1947
Krishna S
|

Updated on: May 16, 2026 | 10:37 AM

Share

స్వాతంత్య్రం దినోత్సవం నాటి పరిస్థితులను నేటితో పోల్చి చూస్తే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. 1947లో ఒక లీటరు పెట్రోల్ ధర కేవలం 27 పైసలు మాత్రమే ఉండేది. ఆ సమయంలో ఒక సాధారణ కారు ట్యాంకును పూర్తిగా నింపడానికి 10 నుండి 11 రూపాయలు సరిపోయేవి. కానీ నేడు అదే 40 లీటర్ల ట్యాంక్ ఫుల్ చేయాలంటే సామాన్యుడు కనీసం 4,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 1947లో 27 పైసలుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర, 1970 నాటికి ఒక రూపాయికి చేరుకుంది. ఆ తర్వాత వేగం పుంజుకుని 1990 నాటికి 5 రూపాయలుగా మారింది. ఇక్కడి నుండి ధరల పెరుగుదల మరింత వేగంగా సాగింది. 2002 నాటికి లీటర్ పెట్రోల్ ధర 26 రూపాయలు కాగా, 2013 నాటికి అది 72 రూపాయలకు చేరింది. ఇక ప్రస్తుత 2026 సంవత్సరంలో దేశంలోని వివిధ నగరాలను బట్టి లీటర్ పెట్రోల్ ధర సుమారుగా 103.98 రూపాయల మార్కు వద్ద కొనసాగుతోంది.

అప్పట్లో ఇతర వస్తువుల ధరలు – జీతాలు

కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, నాడు నిత్యావసరాలు, విలాసవంతమైన వస్తువుల ధరలు కూడా చాలా తక్కువగా ఉండేవి. ఒక తులం బంగారం ధర కేవలం 88 రూపాయలు మాత్రమే ఉండేది. అలాగే ఒక కిలో స్వచ్ఛమైన నెయ్యి రెండు రూపాయలకు లభించేది. నాడు ఒక పెద్ద ఆస్తిగా భావించే సైకిల్ ధర 90 రూపాయలుగా ఉండేది. కేవలం ఒకే ఒక్క రూపాయితో ఒక కుటుంబానికి వారానికి సరిపడా సరుకులు వచ్చేవి. అయితే ఈ ధరలు ఈ రోజు మనకు నమ్మశక్యం కానివిగా అనిపించినప్పటికీ, అప్పట్లో ప్రజల ఆదాయాలు కూడా అదే స్థాయిలో చాలా తక్కువగా ఉండేవి. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రారంభ జీతం నెలకు కేవలం 30 నుండి 50 రూపాయలు మాత్రమే ఉండేది.

పెట్రోల్ ధరలు పెరగడానికి కారణాలివే

పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్, దేశీయ ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణం. మొదటిది 1973, 1979 లలో అంతర్జాతీయంగా వచ్చిన చమురు సంక్షోభాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తగ్గి ధరలు పెరగడం ప్రారంభమైంది. రెండవది, భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 80 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురును డాలర్లలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు డాలర్‌తో రూపాయి విలువ సమానంగా ఉండేది, కానీ కాలక్రమేణా రూపాయి విలువ క్షీణిస్తూ రావడం వల్ల మనం చమురు కోసం రూపాయలలో చెల్లించే మొత్తం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ పన్నులు, డీలర్ కమిషన్లు కలవడం వల్ల బేసిక్ ధర కంటే రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి పెట్రోల్ ధర రెట్టింపు అవుతుంది.

Follow Us