నీళ్లు, పాల కంటే పెట్రోల్ వెరీ చీప్.. లీటర్ వాటర్ బాటిల్ ఎంతో తెలిస్తే అవాక్కవడం పక్కా.. ఎక్కడంటే..?

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం.. కానీ అక్కడ లీటరు పెట్రోల్ కంటే లీటరు తాగునీటి ధర ఐదు రెట్లు ఎక్కువ. ఒకప్పుడు సిరిసంపదలతో తులతూగిన దేశం, నేడు తిండి కోసం చెత్తకుప్పలను వెతుక్కునే స్థితికి ఎలా చేరింది..? అసలు వెనిజులా ఎందుకు కుప్పకూలింది? మదురో పతనం వెనుక ఉన్న అసలు కారణాలేంటి అనేది తెలుసుకుందాం..

నీళ్లు, పాల కంటే పెట్రోల్ వెరీ చీప్.. లీటర్ వాటర్ బాటిల్ ఎంతో తెలిస్తే అవాక్కవడం పక్కా.. ఎక్కడంటే..?
Petrol Cost Cheaper Thank Water And Milk

Updated on: Jan 08, 2026 | 5:01 PM

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం, ఒకప్పుడు లాటిన్ అమెరికాలోనే అత్యంత సంపన్నమైన దేశంగా వెలుగొందిన వెనిజులా నేడు తీవ్ర సంక్షోభంలో ఉంది. అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుతో ఆ దేశంలో 13 ఏళ్ల సుదీర్ఘ పాలన అకస్మాత్తుగా ముగిసింది. అయితే ఈ రాజకీయ మార్పు వెనుక దశాబ్దాల కాలపు ఆర్థిక విధ్వంసం, ఆకలి కేకలు, అణచివేత దాగి ఉన్నాయి. వెనిజులా ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా.. లీటరు పెట్రోల్ ధర కంటే లీటరు తాగునీటి ధర ఐదు రెట్లు ఎక్కువగా ఉంది.

రేట్లు ఇలా

  • పెట్రోల్ 1 లీటరు రూ. 45.10
  • పాలు 1 లీటరు రూ. 160.60
  • వాటర్ బాలిట్ – రూ. 223.70
  • వంట నూనె – రూ. 315 – 405

చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నా.. అమెరికా ఆంక్షలు, సరఫరా గొలుసు దెబ్బతినడంతో స్వచ్ఛమైన తాగునీరు అక్కడ ఒక విలాసవంతమైన వస్తువుగా మారిపోయింది.

ఆర్థిక పతనానికి కారణాలేంటి?

నికోలస్ మదురో నాయకత్వంలో వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి:

చమురుపై అతిగా ఆధారపడటం: వ్యవసాయం, తయారీ రంగాలను విస్మరించి కేవలం చమురుపైనే దేశం ఆధారపడింది. 2010లో చమురు ధరలు పడిపోవడంతో ఆదాయం ఒక్కసారిగా ఆగిపోయింది.

PDVSA పతనం: ప్రభుత్వ చమురు సంస్థ PDVSA రాజకీయీకరణకు గురైంది. నైపుణ్యం లేని విధేయులకు పదవులు ఇవ్వడం, నిర్వహణ లోపం వల్ల ఉత్పత్తి భారీగా క్షీణించింది.

అధిక ద్రవ్యోల్బణం: ఆదాయం లేక ప్రభుత్వం విచ్చలవిడిగా కరెన్సీని ముద్రించింది. దీనివల్ల బొలివర్ కరెన్సీ విలువ సున్నాకి పడిపోయింది. 2021లో ప్రభుత్వం కరెన్సీ నోట్లపై ఏకంగా ఆరు సున్నాలను తొలగించాల్సి వచ్చింది. ఒక కిలో చికెన్ కొనాలన్నా సంచులతో డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆకలి చావులు – సామూహిక వలసలు

2021 నాటి నివేదికల ప్రకారం.. వెనిజులాలో 94శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ఆహారం దొరకక ప్రజలు చెత్త కుప్పల్లో వెతుక్కునే దుస్థితి నెలకొంది. ఈ కష్టాలు భరించలేక దాదాపు 60 లక్షల మంది ప్రజలు కొలంబియా, బ్రెజిల్ వంటి పొరుగు దేశాలకు వలస వెళ్ళిపోయారు. ఇది ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభాలలో ఒకటిగా నిలిచింది.

వివాదాలు.. అణచివేత

2013లో హ్యూగో చావెజ్ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన మదురో, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాస్వామ్య విలువలని తుంగలో తొక్కారనే విమర్శలు ఉన్నాయి. 2018, 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అంతర్జాతీయ సమాజం మదురో ప్రభుత్వాన్ని గుర్తించడానికి నిరాకరించింది. ప్రతిపక్షాలను అణచివేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం ఆయన పాలనలో సర్వసాధారణంగా మారాయి. అమెరికా దళాల చేతిలో మదురో చిక్కడంతో వెనిజులాలో ఒక చీకటి అధ్యాయం ముగిసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం, ప్రజల ఆకలి తీర్చడం ఇప్పుడు రాబోయే నాయకత్వానికి ఉన్న అతిపెద్ద సవాలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి