ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో గత రెండు వారాలుగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలు (Personal Loans)పై వడ్డీ రేట్లు పెంచాయి. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ భారం మరింత పెరిగింది. అయితే వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు రుణ గ్రహీతలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కొంటున్నారు. తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ ఇచ్చే బ్యాంకుల వైపు చూస్తున్నారు. తద్వారా రుణ భారం నుంచి కాస్త ఊరట చెందుతున్నారు. ఈ ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకి వ్యక్తిగత రుణాలు ఇస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)లో పర్సనల్ లోన్స్‌పై వార్షిక వడ్డీ రేటు 8.80 శాతం నుంచి 15.35 శాతం వరకు ఉంది. రూ.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే ఐదేళ్ల టెన్యూర్‌లో నెల వారీ ఈఎంఐ రూ.10,331 – 11,987 చెల్లించాల్సి ఉంటుంది. లోన్ మొత్తంపై 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. రుణగ్రహీతలు చేసే ఉద్యోగం, ఆదాయం, క్రెడిట్ స్కోరు, వయస్సు తదితర అంశాల ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారుతాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో పర్సనల్ లోన్స్‌పై వార్షిక వడ్డీ రేటు 9.80 శాతం నుంచి 13.80 శాతంగా ఉంది. ఐదేళ్ల టెన్యూర్‌తో రూ.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.10,574 – 11,582గా ఉంటుంది. బ్యాంకు నుంచి తీసుకునే రుణం మొత్తం మేరకు ప్రోససింగ్ ఫీజు ఉంటుంది. ప్రాససింగ్ ఫీజు 1.5 శాతం లేదా రూ.15,000లో ఏదీ కనిష్ఠ మొత్తమో అది చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)లో పర్సనల్ లోన్స్‌పై వార్షిక వడ్డీ రేటు 9.20 శాతం నుంచి 16.55 శాతంగా ఉంది. ఐదేళ్ల టెన్యూర్‌తో రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే నెలనెలా రూ.10,428 – 12,306 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా రెండు వాతం ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ఠంగా రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు.. గరిష్ఠంగా రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank of Maharashtra) 9.35 శాతం నుంచి 13.70 శాతం వడ్డీ రేటుపై వ్యక్తిగత రుణాలు ఇస్తోంది. ఐదేళ్ల టెన్యూర్‌పై రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే రూ.10,464 – 11,557 నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నుంచి తీసుకునే రుణ మొత్తంపై ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతం పర్సనల్ లోన్స్‌పై 1 శాతం ప్రోససింగ్ ఫీజు లేదా గరిష్ఠంగా రూ.15,000 ఛార్జ్ చేస్తోంది.
చివరగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank of India) 9.8 శాతం నుంచి 13.9 శాతం వార్షిక వడ్డీ రేటుతో పర్సనల్ లోన్స్ ఇస్తోంది. ఐదేళ్ల టెన్యూర్‌పై రూ.5 లక్షల రుణానికి నెలవారీ ఈఎంఐ రూ.10,574 – 11,608 గా ఉంటుంది. రుణ మొత్తంపై 1 శాతం ప్రోసెసింగ్ ఫీజు లేదా గరిష్టంగా రూ.7,500 ప్రోసెసింగ్ ఫీజు ఛార్జ్ చేస్తారు.
అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్ర బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై ఇటీవల వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లకు అనుగుణంగా ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా ఆ బ్యాంకులు పెంచాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..