
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోతుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆల్ టైం రికార్డ్ కనిష్ట స్ధాయికి పడిపోతుంది. మంగళవారం ట్రేడింగ్ ఒక దశలో ఏకంగా రూ.91.01కు చేరుకుంది. చరిత్రలో ఇదే కనిష్ట స్థాయిగా బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రూపాయి మరింతగా పతనమయ్యే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. దీని వల్ల వ్యాపార వర్గాలతో పాటు సామాన్యుడిపై కూడా ప్రభావం పడనుంది. రూపాయి క్షీణించడం వల్ల జీతం తీసుకునే సగటు ఉద్యోగితో పాటు సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం జరగనుందో ఇప్పుడు చూద్దాం.
రూపాయి పతనం వల్ల ఆర్ధిక వ్యవస్థ దిగజారే అవకాశముంది. దీని వల్ల కంపెనీల ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వల్ల రిక్రూట్‌మెంట్స్ ఆపేయవచ్చు. ఇక కంపెనీలకు ఖర్చులు పెరగడం వల్ల ఇంక్రిమెంట్లు ఆపేయవచ్చు. అంతేకాకుండా బోనస్సులు, వేరియబుల్ పే లాంటివి తగ్గించవచ్చు. ఇలా జీతాలపై ప్రత్యక్షంగా రూపాయి పతనం ప్రభావం చూపే అవకావశాలు ఉన్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు స్ధిరంగా ఉన్నా జీతం విలువ తగ్గుతుంది.
ఇక రూపాయి కుప్పకూలడం మీ లోన్ ఈఎంఐపై కూడా ప్రభావం చూపవచ్చు. రూపాయి పతనం వల్ల ఎలక్ట్రానిక్స్‌తో పాటు మందులు, ఇందనం ధరలు పెరిగే అవకాశముంది. దీని వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ కారణాలతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచితే ఈఎంఐ తీసుకునేవారికి నష్టం జరుగుతుంది. ఫిక్స్‌డ్ వడ్డీ రేటుపై లోన్ తీసుకున్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ.. ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఆధారంగా లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ పెరిగి నష్టం జరుగుతుంది. బ్యాంకుల నుంచి విదేశీ కరెన్సీలో లోన్లు తీసుకున్నవారికి రూపాయి పతనం వల్ల భారీగా దెబ్బ పడుతుంది.