
క్యాలెండర్ మారింది. 2025వ ఏడాది ముగియడంతో నేడు 2026వ సంవత్సరంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాం. నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు ఎన్నో మార్పులు మన జీవితాల్లో చోటుచేసుకుంటూ ఉంటాయి. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడంతో దేశంలో అనేక మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. మనల్ని ఆర్ధికంగా ప్రభావితం చేసే ఈ కొత్త విషయాల గురించి ప్రతీఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరముంది. లేకపోతే ఆర్ధికంగా మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఆ రూల్స్ ఏంటో ఓ లుక్కేయండి మరి.
డిసెంబర్ 31వ తేదీతో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్ రిటర్న్స్ పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. జనవరి 1 తేదీ నుంచి మీరు ఇక దాఖలు చేయలేరు. అలాగే ఐటీఆర్-U కూడా నేటి నుంచి దాఖలు చేసేందుకు అవకాశం లేదు. దీంతో ఇప్పటివరకు గత ఆర్ధిక సంవత్సరానికి చెందిన రిటర్న్స్ దాఖలు చేయనివారు నష్టపోనున్నారు. సెప్టెంబర్ 16వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అవకాశం కల్పించింది. ఆ తర్వాత లేట్ ఫీజు చెల్లించి దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు సమయం ఇచ్చింది. ఇప్పుడు ఆ గుడువు కూడా ముగిసింది.
జనవరి 1వ తేదీ నుంచి సిబిల్ స్కోర్‌లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి మాత్రమే క్రెడిట్ స్కోర్‌ను బ్యాంకులు అప్‌డేట్ చేసేవి. ఇక నుంచి వారానికి ఒకసారి బ్యాంకులు సిబిల్ స్కోర్‌ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీ ఆర్ధిక వివరాలు అన్నీ వేగవంతంతగా సిబిల్ స్కోర్‌లో ప్రతిబింబించనున్నాయి.
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి డిసెంబర్ 31తో డెడ్ లైన్ ముగిసింది. దీంతో నేటి నుంచి ఇక లింక్ చేసుకోలేరు. దీని వల్ల పాన్ కార్డు విషయంలో లింక్ చేసుకోనివారికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు మీరు నిర్వహించలేరు. పాన్ కార్డును ఇనాక్టివ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.
ప్రతీ నెలా ఒకటో తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మారుతాయి. జనవరి 1 రావడంతో కొత్త ధరలను ఆయిల్ కంపెనీలు ప్రకటించనున్నాయి. గత కొద్ది నెలలుగా ఇంట్లోకి ఉపపయోగించుకునే గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండకపోగా.. హోటళ్లకు ఉపయోగించుకునే వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గుతున్నాయి.