మీరు కారు కొనాలనుకుంటున్నారా? అది కూడా కార్ లోన్ తీసుకొని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఈ స్టోరీ మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కారు లోన్ తీసుకొని వాహనం కొనుగోలు చేయాలనుకునే వారిని కొంతకాలం వెయిట్ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు? అది ఎందుకు, ఏమిటి, ఎలా? తెలుసుకుందాం..
కారు రేట్లు పెరిగిపోయాయి. లోన్లలపై వడ్డీ రేట్లు ఎక్కువయ్యాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఫలితంగా ఒక సగటు మనిషి ఓ కారును కలిగి ఉండటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో ఈ పరిస్థితి మరి అధికమైంది. అయినప్పటికీ వేల సంఖ్యలో ఏటా కార్లను కొనుగోలు చేయడానికి జనాలు మొగ్గుచూపుతున్నారు. అయితే కారును ఎలా కొనుగోలు చేయాలి? మొత్తం క్యాష్ పెట్టి కొనుగోలు చేయాలా? కార్ లోన్ పెట్టుకుంటే ఉపయోగమా? నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఇలాంటి సందేహాలు మీలో కూడా ఉన్నాయా.. అయితే ఇదిగో నిపుణులు చెబుతున్న సూచనలు..
సాధారణంగా చాలా మంది కారు కొనాలనుకునే వారు కార్ లోన్ కు మొగ్గుచూపుతారు. అదే బెస్ట్ ఆప్షన్ కూడా! ఎందుకంటే. మన చేతిలో ఉన్న మొత్తం నగదును కారు కోసం వెచ్చిస్తే.. ఏదైనా అత్యవసరం అయినప్పుడు ఇబ్బందులు పడి అప్పుల పాలవుతాం. అదే కొంత అమౌంట్ డౌన్ పేమెంట్ చేసుకుని మిగిలినది కారు లోన్ తీసుకొని నెలనెలా ఈఎంఐ కట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. సాధారణంగా కారు లోన్ తీసుకోవాలంటే కారు మొత్తం ధరలో కనీసం 10 నుంచి 15 శాతం ముందుగా చెల్లించి, మిగిలినది ఈఎంఐ ల రూపంలో చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్, ఈఎంఐ పరిధి వంటి వాటిలోనే కొనుగోలు దారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
సాధారణంగా ఫైనాన్షియర్లు 10 నుంచి 15 శాతం డౌన్ పేమెంట్ చేయాలని చెబుతున్నారు. ఉదాహరణకు మీరు ఓ కారును రూ. 10 లక్షలకు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారనుకోండి. దీనిలో డౌన్ పేమెంట్ 10 నుంచి 15 శాతం అంటే రూ. 1.2 నుంచి 1.8 లక్షల వరకూ కట్టాలి. మిగిలినది కార్ లోన్ కింద మూడు నుంచి ఐదేళ్ల కాల వ్యవధిలో ఈఎంఐల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
మీరు రూ. 12లక్షల కారుకు రెండు లక్షలు డౌన్ పేమెంట్ చేసి.. మిగిలిన రూ. 10 లక్షలకు కార్ లోన్ తీసుకున్నారనుకోండి. దానిపై వడ్డీ 9శాతం అనుకుంటే నాలుగేళ్లలో ఈ మొత్తాన్ని చెల్లించాలని పెట్టుకుంటే.. మీకు ప్రతి నెలా పడే ఈఎంఐ రూ. 24, 885. ఈ లెక్కన మీరు మొత్తం నాలుగేళ్లు కడితే.. మీరు చెల్లించే వడ్డీ మొత్తం రూ. 2 లక్షలు. అంటే రూ. 10 లక్షల లోన్ కోసం మీరు రూ. 12 లక్షలు చెల్లిస్తారు. ఇది నెలవారీ కట్టాల్సి ఉన్నందన్నభారం అవుతుంది.
ఈ ఈఎంఐ భారం తగ్గించుకొని.. వడ్డీ కూడా తక్కువ పడాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే డౌన్ పేమెంట్ అధికంగా చెల్లంచడం. అంటే మీరు సాధారణంగా చెల్లించే 10 నుంచి 15 శాతం కాకుండా .. 50 నుంచి 60 శాతం చెల్లిస్తే చాలా వరకూ వడ్డీ తగ్గి మీపై ఈఎంఐ ల భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
డౌన్ పేమెంట్ అధికంగా కట్టాలి అంటే మీ దగ్గర పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఉండాలి. నిపుణులు చెబుతున్నది కూడా ఇదే. మీరు కారు కొనాలనుకున్నప్పుడు మీ చేతిలో పుష్కలంగా నగదు ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకూ ఎక్కువ మొత్తంలో నగదు డౌన్ పేమెంట్ చేస్తే వడ్డీ భారం తగ్గుతుంది. ఒకవేళ ప్రస్తుతం మీ దగ్గర అంత నగదు లేకపోతే , అంత నగదు మీ అకౌంట్లోకి జమయ్యే వరకూ కారు కొనడం వాయిదా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కారు వాయిదా వేసుకొని, కొంత ఆదాయాన్ని సేవింగ్స్ చేసుకొని, మీకు కొనాలనుకున్న కారు మొత్తం ధరలో కనీసం 50 శాతం పైన డౌన్ పేమెంట్ చేసేలా ఉంటే మీకు అన్ని విధాల శ్రేయస్కరం అని వివరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..