Small Saving Schemes: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్పీఎస్ఎస్), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (ఎన్ఎస్పీ), కిసాన్ వికాస్ పత్రా (కేవీపీ) వంటి చిన్న పొదుపు పథకాల (ఎస్ఎస్ఎస్) పై వడ్డీ రేట్లు మారలేదు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికం వరకు వీటి వడ్డీ రేట్లలో మార్పులేదని ప్రభుత్వం ప్రకటించింది. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షించనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఈ జులై నుంచి సెప్టెంబర్ వరకు ఎటువంటి మార్పు లేకపోవడంతో ఖాతాధారులు ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ఐదోసారి ఈ పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం మార్చకపోవడం విశేషం. అంతకుముందు మార్చి 31 న కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించి, మరలా ఆ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. మనదేశంలో చాలామంది ఇలాంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. వీటిలో స్థిరమైన రాబడి వస్తుందని హామీ ఉంటుంది. వీటిలో కొన్ని సెక్షన్ 80 సీ కింద ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారికి ప్రభుత్వం హామీ ఉంటుంది. అందుకే చాలామంది వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం..
జూలై-సెప్టెంబర్ నుంచి పీపీఎఫ్ పథకంలో సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ అందనుంది. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ)లో వడ్డీ రేటు 6.8 శాతంగానే ఉంది. ఇతర చిన్న పొదుపు పథకాలలో ప్రధానమైంది సుకన్య సమృద్ధి యోజన సంవత్సరానికి 7.6 శాతం వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీసు పొదుపు పథకంలో 4 శాతం వడ్డీ రేటు అందనుంది. ఒక సంవత్సరం మేర ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును 5.5 శాతంగా నిర్ణయించారు. రెండు నుంచి మూడేళ్ల డిపాజిట్లపై 5.5 వడ్డీ రేటు ఇవ్వనున్నారు. ఐదేళ్ల డిపాజిట్ల ఖాతాలపై 6.7 శాతం వడ్డీ రానుంది.
అలాగే రికరింగ్ డిపాజిట్లపైనా వడ్డీరేట్లు అలాగే ఉన్నాయి. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 5.8 వడ్డీ రానుంది. కిసాన్ వికాస్ పత్రా సర్టిఫికేట్ పథకంలో 6.9 శాతం వడ్డీని అందించనున్నారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో.. మధ్య, చిన్న తరహా పొదుపు పథకాల వడ్డీరేట్లను ప్రభుత్వం తగ్గించలేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం గడువును పెంచిన సంగతి తెలిసిందే.
Also Read:
Food Oil: సామాన్యులకు భారీ ఊరట.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం