
ఇరాన్ సంఘర్షణ ప్రభావంతో ఇటీవల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్లు ఇప్పుడు క్రమంగా కోలుకునే సంకేతాలు చూపుతున్నాయి. నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల వద్ద నిలబడటంతో, పెట్టుబడిదారులు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ 50 ఆధారిత ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లు భారతదేశంలోని టాప్ 50 లార్జ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. ఇవి పాసివ్‌గా నిర్వహించబడే ఫండ్లు కావడంతో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. మార్కెట్‌ను ఓడించే ప్రయత్నం చేయకుండా, మార్కెట్ పనితీరునే అనుసరించడం వీటి ప్రధాన లక్ష్యం. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇవి స్థిరమైన రాబడులు ఇవ్వగలవని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం అస్థిరత కొనసాగుతున్న మార్కెట్ పరిస్థితుల్లో, బ్లూ-చిప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ఈ ఫండ్లు పెట్టుబడిదారులకు కొంత భద్రతను అందిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఇంధనం, వినియోగ వస్తువుల రంగాల్లో ఉన్న అగ్రగామి కంపెనీలు నిఫ్టీ 50లో భాగంగా ఉంటాయి. ఈ కేటగిరీలో నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న నిప్పాన్ ఇండియా ఇండెక్స్ ఫండ్ – నిఫ్టీ 50 ప్లాన్ అత్యల్ప వ్యయ నిష్పత్తితో ఆకర్షణీయంగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని వ్యయ నిష్పత్తి కేవలం 0.07 శాతం మాత్రమే. ఇదే సమయంలో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ 50 ఫండ్ వ్యయ నిష్పత్తి 0.17 శాతం కాగా, DSP మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ వ్యయ నిష్పత్తి 0.18 శాతంగా ఉంది.
పనితీరు పరంగా కూడా నిప్పాన్ ఇండియా నిఫ్టీ ప్లాన్ గత ఐదేళ్లలో సుమారు 18.38 శాతం CAGR రాబడిని అందించినట్లు సమాచారం. నిఫ్టీ 50 ఇండెక్స్ అర్ధవార్షికంగా రీబ్యాలెన్స్ చేయబడటం వల్ల పెట్టుబడిదారులకు ఆటోమేటిక్ పోర్ట్‌ఫోలియో సర్దుబాటు ప్రయోజనం కూడా లభిస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులను అంచనా వేయడం కంటే, దీర్ఘకాలిక దృష్టితో క్రమం తప్పకుండా SIPల ద్వారా ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచి వ్యూహమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి