
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ కృషి చేస్తోంది. అందులో భాగంగా ఈ నెలలో అమృత్ భారత్ II ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించేందుకు సిద్దమైంది. ఈ రైళ్లలో టికెట్ ఛార్జీలు, బుకింగ్ నియమాలు, క్యాన్సిలేషన్, ఆర్ఏసీ కోటా, టికెట్ రీఫండ్, రిజర్వేషన్ల కోటాకు సంబంధించి కొత్త నిబంధనలు అమలు చేయనుంది. వీటికి సంబంధించిన వివరాలను తాజాగా రైల్వేశాఖ విడుదల చేసింది. ఇప్పటికే నడుస్తున్న అమృత్ భారత్ రైళ్లల్లో కంటే ఈ నెలలో పట్టాలెక్కనున్న వీటిల్లో నిబంధనలు కాస్త భిన్నంగా ఉన్నాయి. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తగా రానున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రాథమిక ఛార్జీ వివరాలు మారలేదు. కానీ కనీస దూరానికి వసూలు చేసే ఛార్జీలలో మార్పులు చోటుచేసుకున్నాయి. స్లీపర్ క్లాసుల్లో 200 కిలోమీటర్ల ప్రయాణానికి కనీస ఛార్జీ రూ.149 చెల్లించాలి. ఇక సెకండ్ క్లాసుల్లో కనీస ఛార్జీ 50 కోలోమీటర్ల దూరానికి రూ.36గా రైల్వేశాఖ నిర్ణయించింది. దీంతో అంతకంటే తక్కువ దూరం ప్రయాణం చేసినప్పటికీ కనీస ఛార్జీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులకు ఇది భారమే అని చెప్పవచ్చు.
ఇక ఈ రైళ్లల్లో స్లీపర్ క్లాసులకు ఆర్‌ఏసీ టికెట్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. దీంతో ఆర్ఏసీ టికెట్లు అందుబాటులో ఉండవు. కేవలం కాన్ఫార్మ్‌డ్ టికెట్లు ఉన్నవారు మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. అయితే సెకండ్ క్లాసుకు మాత్ర పాత నియమాలు అమల్లోకి ఉంటాయి.
ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ II రైళ్లల్లో రిజర్వేషన్ల కోటాలో మార్పులు జరిగాయి. స్లీపర్ క్లాసులో మూడు కేటగిరీల కోటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే ప్రత్యేక కోటా వర్తిస్తుంది. ఇక 60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్లకు, 40 సంవత్సరాలు నిండిన మహిళలకు లోయర్ బర్త్‌లు కేటాయించే కోటా అమల్లో ఉంటుంది. ఇక మీతో పాటు పిల్లలు ప్రయాణిస్తుంటే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ప్రాధాన్యతను బట్టి లోయర్ బర్త్ కేటాయిస్తుంది.
ఇక టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ట్రైన్ ప్రయాణించడానికి 24 గంటల ముందు టికెట్ రద్దు చేసినవారికి రీఫండ్‌కు సంబంధించి త్వరలో కొత్త విధానం ఏర్పాటు చేయను్నారు. డిజిటల్ పద్దతిలోనే రీఫండ్ చెల్లిస్తారు. ఇక కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు కూడా డిజిటల్ పేమెంట్స్‌ను స్వీకరిస్తారు. ఒకవేళ డిజిటల్ పేమెంట్ సౌకర్యం అందుబాటులోకి లేకపోతే నగదు రూపంలో చెల్లించవచ్చు.