RBI on tax reduction in fuel prices : భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. రోజు రోజు పెరుగుతున్న చమురు ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే, ఇంధన దిగుమతుల విషయమై గత ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఏదేమైనా దీంతో దేశంలోని మధ్య తరగతి ప్రజలు భారం మోయాల్సి వస్తోంది. కాగా వరుసగా పెరుగుతున్న ధరలపై భారత రిజర్వ్ బ్యాంక్ స్పందించింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ..పన్నుల తగ్గింపుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందన ధరలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇందులోభాగంగా పెట్రోల్, డీజిల్‌పై విధించే ప్రభుత్వం విధిస్తున్న పరోక్ష పన్నులను తగ్గించవచ్చని అభిప్రాయపడింది. బాంబే ఛాంబర్ ఆఫ్ కామర్స్(బీసీసీ) 185వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతోన్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమేని శక్తికాంతదాసు అభిప్రాయపడ్డారు. కరోనా అనంతరం ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆదాయం మార్గాలు తగ్గి ప్రభుత్వ ఖర్చులు పెరిగాయన్నారు. దీంతో ఖజనాను పెంచుకునే మార్గంలో పన్నుల భారం తగ్గించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత లేదని ఆయన అన్నారు. కానీ, వీటిని తగ్గించకపోతే మళ్లీ ద్రవ్యోల్బణానికి దారితీస్తాయని ఆర్‌బీఐ గవర్నర్ హెచ్చరించారు.
గత కొంతకాలంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికీ, ఇంధన ధరల వల్ల రానున్న రోజుల్లో తయారీ, ఉత్పత్తి రంగంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. గడిచిన పది రోజులుగా దేశంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని.. కొన్ని రాష్ట్రాల్లో లీటరు రూ.100కు చేరువయ్యిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంధనంపై భారీగా ఉన్న పరోక్ష పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయ చర్యలతో వీటి ధరలను అదుపులోకి తేవచ్చని శక్తికాంత దాస్ అన్నారు. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు దేశంలో ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తోన్న పన్నుల వల్లే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రిటైల్ అమ్మకపు ధరపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్‌పై 60శాతంపైగా, డీజిల్‌పై 56శాతం పన్నుల భారం విధిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
Read Also… India vs England 3rd Test Live: పింక్‌బాల్ టెస్ట్‌లో రెండో రోజు సూపర్ ఫైట్..! నీవా..! నేనా..!