AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు..! ఈ సారి..

దేశంలోని మొబైల్ వినియోగదారులకు త్వరలో మరో షాక్ తగలనుంది. ప్రముఖ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను 12 నుంచి 15 శాతం వరకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పెంపు రాబోయే నాలుగు నుంచి ఐదు నెలల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు..! ఈ సారి..
Recharge
Venkatrao Lella
|

Updated on: Oct 11, 2026 | 12:37 PM

Share

దేశవ్యాప్తంగా మొబైల్స్ వాడేవారికి త్వరలో మరోసారి షాక్ తగలనుంది. టెలికాం కంపెనీలు మరోసారి రీఛార్జ్ ధరలను పెంచేందుకు సిద్దమవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పలుమార్లు పెంచగా.. మరోసారి భారం మోపేందుకు సిద్దమవుతున్నాయి.  రాబోయే నాలుగైదు నెలల్లో మరోసారి ధరలను పెంచవచ్చని తెలుస్తోంది. ఈ ధరల పెంపు 12 నుంచి 15 శాతం వరకు ఉండవచ్చని చెబుతున్నారు. దీని వల్ల మొబైల్ వాడాలంటే వినియోగదారులు మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వార్తలు సామాన్య ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ ధరలతో ప్రజలు సతమతం అవుతున్నారు. బేసిక్ రీఛార్జ్ ప్లాన్ ధరలు రూ.300 వరకు చేరుకున్నాయి. ఎక్కువ డేటా కావాలంటో మరింత ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

ధరలు పెంపునకు కారణాలు

టెలికాం కంపెనీలు ధరల పెంపునకు అనేక కారణాలను చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా 5G సేవలను వేగంగా విస్తరిస్తున్న కారణంగా టెలికాం కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. 5G నెట్‌వర్క్‌ల ఏర్పాటు, టవర్ల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ వ్యయం అవుతోంది. ఈ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి, కంపెనీలు వినియోగదారుల నుండి అదనపు ఆదాయాన్ని ఆశిస్తున్నాయి. ఇక టెలికాం కంపెనీలు తమ ఏఆర్పీయూను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సగటున ఒక వినియోగదారుడి నుండి వచ్చే ఆదాయాన్ని ఏఆర్పీయూ అంటారు. దీని వల్ల తమ రాబడులను పెంచుకోవాలని భావిస్తున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన కంపెనీలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రధానంగా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. పోటీ తగ్గడంతో ధరలు పెంచేందుకు కంపెనీలకు మరింత స్వేచ్ఛ లభించిందని చెప్పవచ్చు.

మధ్యతగరతి ప్రజలపై భారం

నెట్‌వర్క్ టవర్ల నిర్వహణ, సాంకేతికత అప్‌గ్రేడ్‌లు, కొత్త మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి నిరంతరం ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఖర్చులను భర్తీ చేసుకోవడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే రీఛార్జ్ ధరల పెంపు వల్ల సామాన్య, మధ్యతరగతి వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. మొబైల్ రీఛార్జ్ కూడా మరింత భారంగా మారే అవకాశముంది. మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ అవసరమైన నిత్యావసర సేవగా మారింది. ఈ నేపథ్యంలో ధరల పెంపు నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం మోపనుంది.

Follow Us