ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. 90 రోజుల్లో ఇది చేయకపోతే సిలిండర్ల సరఫరా బంద్
మీ ప్రాంతంలో పీఎన్జీ అందుబాటులో ఉందా.. అయితే ఎల్పీజీ కనెక్షన్లు వదలుకుని పీఎన్జీలోకి మారాల్సిందే. ఇందుకోసం కేంద్రం 90 రోజులు గడువు కూడా గతంలో విధించింది. ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఎల్పీజీ నుంచి పీఎన్‌జీకి మారడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో 90 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే. పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్‌జీ) నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఎల్పీజీ సిలిండర్ల నుండి పీఎన్‌జీకి మారే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. అర్హులైన వినియోగదారులకు పీఎన్‌జీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 90 రోజుల గడువు ఇచ్చింది. ఈ నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోని పక్షంలో వారి ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ నిలిపివేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీ లభ్యతను పెంచడం, ఎక్కువమంది పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
PNG అంటే ఏమిటి?
పిఎన్జీ అంటే పైప్డ్ నేచురల్ గ్యాస్. ఇది పైప్‌ల ద్వారా నేరుగా మన ఇంటికి గ్యాస్ సరఫరా చేస్తారు. ఇందులో ప్రధానంగా మీథేన్ గ్యాస్ ఉంటుంది. చాలా మందికి 24 గంటలు గ్యాస్ పైప్‌లో ఉంటే అది ప్రమాదకరం కాదా? అనే భయం ఉంటుంది. అయితే నిజానికి ఎల్పీజీ కంటే పీఎన్జీ సురక్షితమైనది. ఎల్పీజీ గ్యాస్ గాలి కంటే బరువుగా ఉంటుంది. దీంతో లీక్ అయితే కింద చేరి ఒకేచోట నిలిచిపోతుంది. చిన్న స్పార్క్ వచ్చినా ప్రమాదం జరగొచ్చు. కానీ పీఎన్జీ గ్యాస్ గాలి కంటే తేలికగా ఉంటుంది. లీక్ అయిన వెంటనే గాలిలో కలిసిపోతుంది, ప్రమాదం కలిగించే అవకాశం చాలా తక్కువ. పైగా, ఎల్పిజి సిలిండర్లలో గ్యాస్ చాలా అధిక పీడనంతో ఉంటుంది, పిఎన్జిలో పీడనం చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి బ్లాస్ట్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి.
సౌకర్యం, ఖర్చులో వ్యత్యాసం
ఎల్పీజీ సిలిండర్‌కు మనం ముందుగా డబ్బు చెల్లించి బుక్ చేయాలి. డెలివరీ కోసం కొన్ని రోజులు వేచి ఉండాలి. మధ్యలో గ్యాస్ అయిపోతే అసౌకర్యం కలుగుతుంది. పిఎన్జీలో అలాంటి సమస్యలు ఉండవు. గ్యాస్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీ ఇంట్లో మీటర్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఎంత గ్యాస్ వాడతారో అంతకే బిల్లు వస్తుంది. నెల చివర్లో బిల్లు లాగానే గ్యాస్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఖర్చు విషయానికి వస్తే.. రెండు ఎల్పిజి సిలిండర్లు వాడే సాధారణ కుటుంబానికి నెలకు దాదాపు రూ.1700 ఖర్చయితే.. పిఎన్జీ వాడితే సుమారు రూ.1400 నుంచి రూ.1500 మధ్య ఖర్చు ఉండవచ్చు. దీంతో దీర్ఘకాలంలో కొంతమేర డబ్బులు పొదుపు అవుతాయి.
పీఎన్జీ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
పీఎన్జీ కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభమైన పని. మీ ప్రాంతంలో పీఎన్జీ గ్యాస్ సర్వీస్ అందిస్తున్న కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి లభ్యతను తనిఖీ చేయాలి. అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ వంటి సాధారణ పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. ఒక రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్యాస్ కంపెనీ వాళ్లే వచ్చి మీ ఇంట్లో మీటర్, పైప్‌లైన్ ఏర్పాటు చేసి కనెక్షన్ ఇస్తారు.
