AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే కనెక్షన్ కట్.. కొత్త రూల్స్ ఇవే..

జూలై 1 నుండి అమల్లోకి రానున్న కొత్త గ్యాస్ నిబంధనల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేకపోతే రాబోయే రోజుల్లో మీ గ్యాస్ కనెక్షన్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇళ్లలో పైప్‌లైన్ గ్యాస్ వాడుతున్న వారు, అలాగే ఇప్పటివరకు ఈ కేవైసీపూర్తి చేయని కస్టమర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే కనెక్షన్ కట్.. కొత్త రూల్స్ ఇవే..
Lpg Cylinder New Rules From July 1
Krishna S
|

Updated on: Jun 29, 2026 | 2:11 PM

Share

ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా?.. అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాలి. జూలై 1 నుండి దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన పలు కీలక నిబంధనలు మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ కారణంగా కొందరు పాత కస్టమర్ల గ్యాస్ కనెక్షన్లు పూర్తిగా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఇళ్లలో పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవారు.. అలాగే ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేయని వారు జూలై 1 నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

పీఎన్‌జీ ఉంటే.. 30 రోజుల్లో ఎల్‌పీజీ కట్..

గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సవరణ ఉత్తర్వులను తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఎవరి ఇంట్లోనైనా ఇప్పటికే పీఎన్‌జీ కనెక్షన్ ఉండి.. దాంతో పాటు ఇండేన్, హెచ్‌పీ లేదా భారత్ గ్యాస్‌కు సంబంధించిన ఎల్‌పీజీ కనెక్షన్ కూడా వాడుతుంటే వారి ఎల్‌పీజీ కనెక్షన్ 30 రోజుల్లోగా రద్దు చేయడం జరుగుతుంది. ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ కస్టమర్లు స్వచ్ఛందంగా తమ ఎల్‌పీజీ కనెక్షన్‌ను సరెండర్ చేస్తే.. వారికి ఒక కూపన్ ఇస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ ఎల్‌పీజీ కనెక్షన్ కావాలనుకుంటే ఈ కూపన్ ఉపయోగించి సులభంగా పొందవచ్చు.

ముగియనున్న 3 నెలల డెడ్‌లైన్..

మీ ఏరియాలో పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు ఉండి.. గ్యాస్ సరఫరా అందుబాటులో ఉంటే.. అక్కడ ఉన్న ఎల్‌పీజీ కస్టమర్లందరూ 3 నెలల లోపు పీఎన్‌జీ కనెక్షన్‌కు మారాలని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ప్రకటించింది. అలా మారని పక్షంలో వారి గ్యాస్ కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేస్తారు. మార్చిలో విధించిన ఈ 3 నెలల గడువు జూన్ చివరి నాటితో ముగిసిపోతుంది. కాబట్టి మీ ఏరియాలో పైప్‌లైన్ గ్యాస్ ఉంటే వెంటనే ఆ సదుపాయాన్ని చేసుకోక తప్పదు.

ఈ కేవైసీ తప్పనిసరి.. జూన్ 30 చివరి తేదీ..

ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారందరికీ ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. కస్టమర్లందరూ జూన్ 30 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ గడువులోగా ఈ కేవైసీ పూర్తి చేయకపోతే.. జూలై 1 నుండి వారి గ్యాస్ సర్వీస్ నిలిచిపోవచ్చు లేదా సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు తీవ్ర ఇబ్బందులు రావచ్చు. అయితే ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారికి ఈ రూల్ వర్తించదు, వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.

గ్యాస్ బుకింగ్ గడువు తగ్గుతుందా?

ప్రస్తుతం నగరాల్లో ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్ బుక్ చేయడానికి 25 రోజులు, అలాగే గ్రామాల్లో అయితే 45 రోజుల గ్యాప్ ఉండాలనే నియమం ఉంది. గతంలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి, నిరంతర సరఫరాను కొనసాగించడానికి కేంద్రం ఈ పరిమితిని విధించింది. అయితే ప్రస్తుతం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గం ఓపెన్ అవ్వడంతో.. జూలై 1 నుండి ఈ బుకింగ్ గడువు కాల పరిమితిని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే సాధారణ గ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరట లభించినట్లే.

Follow Us