చాలా మంది వివిధ కారణాలతో పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు. కానీ ఎక్కువ ఖాతాలు ఉండడం మంచిది కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వేతన ఖాతాతో పాటు, గృహ, బంగారం, రుణాల కోసం, క్రెడిట్ కార్డు ఆఫర్ల కోసం, డీమ్యాట్ ఖాతా కోసం ఇలా రకరకాల కారణాలతో చాలా మంది వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తుంటారు. కొంత మందికి ఒకటి కంటే ఎక్కువ వేతన ఖాతాలు ఉంటాయి. పాత ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు కొత్తగా ఖాతా తెరుస్తారు. కానీ పాత ఖాతా మూసివేయరు. ఈ కారణంగా ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటాయి.
అయితే, అన్ని ఖాతాలు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండలేవు ఖాతాల్లో కనీస నిల్వ లేకుంటే ఛార్జీలు పడతాయి. ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఎంతో కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఖాతాలు ఉంటే అన్ని ఖాతాల్లో కనీస మొత్తం ఉండాలి. లేకుంటే ఫైన్ పడుతుంది. చాలా వరకు బ్యాంకులు రూ. 5000 నుంచి రూ.10 వేల కనీస నిల్వ నిర్వహించాలని చెబుతున్నాయి. అంటే మీకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయనుకుంటే రూ. 25,000 నుంచి రూ.50,000 వేల వరకు ఖాతాల్లో లాక్ అయిపోతుంది.
అయితే అస్సలు వినియోగంలో లేని ఖాతాను మూసివేయడమే మంచిది. బ్యాంకుల్లో ఉన్న కనీస నిల్వలపై 3-4 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. అదే మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెడితే దానికంటే రెట్టింపు వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా పొదుపు ఖాతాలపై ఇతర ఛార్జీలు, అంటే డెబిట్ కార్డ్ ఛార్జీలు వంటివి వర్తిస్తాయి. మీ వేతన ఖాతా లేదా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలో వరుసగా మూడు నెలలు ఎలాంటి డిపాజిట్ చేయకపోతే ఆ తర్వాత అది సాధారణ పొదుపు ఖాతాగా మారుతుంది.
ఖాతా నుంచి వరుసగా రెండేళ్ల కంటే ఎక్కువ కాలం లావాదేవీలు జరగకపోతే ఆ ఖాతాలను బ్యాంకులు పనిచేయని ఖాతాలుగా పరిగణిస్తాయి. అప్పుడు ఖాతా నుంచి డెబిట్ కార్డ్, చెక్కులు, ఆన్‌లైన్, మొబైల్ లావాదేవీలు జరిపేందుకు వీలుండదు. ఆ ఖాతాను యాక్టివేట్ చేసేందుకు రాతపూర్వకంగా అభ్యర్థించాల్సి ఉంటుంది.
బ్యాంకు ఖాతాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. వేతన ఖాతా, కుటుంబ సభ్యులతో కలిపి ఉమ్మడి ఖాతా ఉంటే మంచిది. కొత్త ఖాతా ప్రారంభించినప్పుడు అవసరం లేని పాత ఖాతాల్ని మూసేయడం మంచిది.ఇప్పుడు ఒక ఈపీఎఫ్ ఖాతాకు ఒక యూఏఎన్ ఇస్తారు. ఉద్యోగం మారినప్పుడు అదే యూఎన్‌తో ఖాతాలోని మొత్తాన్ని ఇతర సంస్థకు బదిలీ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లు, పీపీఎఫ్ వంటి పెట్టుబడులకు ఒకే ఖాతాను ఉపయోగించాలి.
ఆర్థిక జీవితానికి బ్యాంకు ఖాతా, పాన్, ఆధార్ చాలా కీలకమైన ఆధారాలు. పన్ను చెల్లింపుల నుంచి బిల్లు చెల్లింపులు, ఇతర ఏ పనికైనా పాన్, ఆధార్, బ్యాంకు ఖాతా తప్పనిసరి. తక్కువ ఖాతాలు ఉంటే లావాదేవీలు, బ్యాంకు కార్యకలాపాలను ఎప్పటికప్పుడు చూసుకునేందుకు సులభంగా ఉంటుంది. రెండు లేదా మూడు అంతకంటే ఎక్కవ ఖాతాలు ఉండటం ఆర్థిక జీవనానికి సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also.. Medicine: నకిలీ మందులను ఇలా సింపుల్గా గుర్తించండి.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు..