Education Budget 2024: బడ్జెట్లో విద్యార్థులకు ‘ఉన్నత’ బహుమతి.. రూ. 10లక్షల వరకూ సులభంగా రుణం..

|

Jul 23, 2024 | 12:48 PM

బడ్జెట్ ప్రసంగం చేస్తున్నకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నత విద్యకు అధిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఏటా 25,000 మంది విద్యార్థులకు సహాయం చేసేందుకు ప్రారంభించిన మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ ను సవరిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల రుణ పరిధిని రూ. 10లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.

Education Budget 2024: బడ్జెట్లో విద్యార్థులకు ‘ఉన్నత’ బహుమతి.. రూ. 10లక్షల వరకూ సులభంగా రుణం..
Loan For Higher Education
Follow us on

వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ ను మంగళవారం ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రసంగం చేస్తున్నకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నత విద్యకు అధిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. తన బడ్జెట్ 2024 ప్రసంగంలో ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. ఏటా 25,000 మంది విద్యార్థులకు సహాయం చేసేందుకు ప్రారంభించిన మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ ను సవరిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల రుణ పరిధిని రూ. 10లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. అందుకోసం ప్రత్యేకమైన ఈ-ఓచర్లను అందివ్వనున్నట్లు చెప్పారు. ఏటా ఒక లక్ష మంది విద్యార్థులకు ఈ ఓచర్లు అందివ్వనున్నట్లు చెప్పారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం ప్రతి సంవత్సరం ఒక లక్ష మంది విద్యార్థులకు నేరుగా రూ. 10 లక్షల రుణానికి సంబంధించిన ఈ ఓచర్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాక ఈ రుణ మొత్తంలో 3శాతం వార్షిక వడ్డీ రాయితీ కోసం అందివ్వనున్నట్లు చెప్పారు.

మహిళలకూ పెద్ద పీట..

అంతేకాక పరిశ్రమల సహకారంతో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లు, క్రెచ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహిళలు, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇది దేశంలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు బాగా ఉపకరించే అంశం. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు పడే దిగువ మధ్య తరగతికి ఈ నిర్ణయం మేలు చేస్తుంది.

ఇతర ప్రకటనలు..

విద్యతో పాటు ఇతర ప్రధాన రంగాలకు సైతం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్ల కేటాయించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • 10,000 బయో రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
  • వచ్చే రెండేళ్లలో, 1 కోటి మంది రైతులు బ్రాండింగ్, సర్టిఫికేషన్ ద్వారా సహజ వ్యవసాయంలోకి ప్రవేశించనున్నారు.
  • కూరగాయల ఉత్పత్తి, సప్లై చైన్, వినియోగ కేంద్రాలకు సమీపంలో పెద్ద సమూహాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
  • రొయ్యల పెంపకం కేంద్రాలకు ఆర్థిక సహాయం అందించడం, నాబార్డ్ ద్వారా ఎగుమతిని సులభతరం చేస్తామన్నారు.
  • 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించనున్నారు.
  • 109 రకాల 32 పంట రకాలను విడుదల చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు.
  • సేంద్రియ సాగు చేసే రైతులకు ధ్రువీకరణ, బ్రాండింగ్‌తో సహాయం చేస్తామని చెప్పారు.
  • పప్పుధాన్యాలు, నూనెగింజల విత్తనాల సాగు చేసే వారికి స్వయం సమృద్ధిని అందించడానికి 6 కోట్ల మంది రైతుల భూమిని రిజిస్ట్రీలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..