లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి? EMI కట్టలేనప్పుడు అది ఎలా ఉపయోగపడుతుంది?

ఆర్థిక ఇబ్బందుల కారణంగా EMIలు కట్టడం కష్టమైనప్పుడు బ్యాంకులు లోన్ రీస్ట్రక్చరింగ్‌ను అందిస్తాయి. దీని ద్వారా రుణ కాలపరిమితి పెంచడం, EMI తగ్గించడం వంటి సదుపాయాలతో తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. అయితే, దీర్ఘకాలంలో వడ్డీ భారం పెరిగే అవకాశం ఉంది. మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడకుండా, పూర్తి వివరాలు తెలుసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి? EMI కట్టలేనప్పుడు అది ఎలా ఉపయోగపడుతుంది?
Loan Restructuring

Updated on: May 18, 2026 | 9:50 AM

ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఎదురవుతాయో చెప్పడం కష్టం. ఉద్యోగం కోల్పోవడం, జీతంలో కోతలు, ఆరోగ్య సమస్యలు లేదా వ్యాపార నష్టాలు వంటి పరిస్థితులు ఒక్కసారిగా రుణ చెల్లింపులను భారంగా మార్చేస్తాయి. అలాంటి సమయంలో చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య నెలవారీ EMIలను సమయానికి చెల్లించలేకపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు అందించే ఒక ముఖ్యమైన సదుపాయం లోన్ రీస్ట్రక్చరింగ్.

లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే ఇప్పటికే తీసుకున్న రుణానికి సంబంధించిన చెల్లింపు నిబంధనలను బ్యాంకు సవరించడం. దీని ఉద్దేశం రుణాన్ని మాఫీ చేయడం కాదు. రుణగ్రహీత ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చెల్లింపులను సులభతరం చేయడం. సాధారణంగా బ్యాంకులు రుణ కాలపరిమితిని పెంచడం, EMI మొత్తాన్ని తగ్గించడం, తాత్కాలిక మారటోరియం ఇవ్వడం లేదా వడ్డీ రేట్లలో మార్పులు చేయడం వంటి చర్యలు తీసుకుంటాయి. చాలా సందర్భాల్లో బ్యాంకులు రుణాన్ని డిఫాల్ట్‌గా మారనివ్వడం కంటే రీస్ట్రక్చరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తాయి. ఎందుకంటే రుణగ్రహీత పూర్తిగా చెల్లింపులు ఆపేస్తే అది నిరర్థక ఆస్తి (NPA)గా మారే ప్రమాదం ఉంటుంది.

అందుకే తాత్కాలిక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కొంత ఉపశమనం కల్పించి తిరిగి చెల్లింపులను కొనసాగించే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తాయి. అయితే ఇందుకోసం ఉద్యోగ నష్టం, ఆదాయం తగ్గడం లేదా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని కోరవచ్చు. ఈ విధానంలో ప్రధాన ప్రయోజనం నెలవారీ EMI భారం తగ్గడం. దీని వల్ల వ్యక్తులు తమ ప్రస్తుత ఆదాయానికి అనుగుణంగా చెల్లింపులను కొనసాగించగలుగుతారు. కానీ దీని మరోవైపు రుణ కాలపరిమితి పెరగడం వల్ల మొత్తం చెల్లించాల్సిన వడ్డీ మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా, దీర్ఘకాలంలో ఖర్చు ఎక్కువ కావచ్చు.

లోన్ రీస్ట్రక్చరింగ్ ప్రతి ఒక్కరికీ సరిపోదు. తాత్కాలిక ఆర్థిక సమస్యలు ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. కానీ ఆదాయ సమస్యలు దీర్ఘకాలంగా కొనసాగుతాయని భావిస్తే ఇతర ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించడం అవసరం. అదేవిధంగా లోన్ రీస్ట్రక్చరింగ్ క్రెడిట్ రిపోర్ట్‌పై కూడా ప్రభావం చూపవచ్చు. భవిష్యత్తులో కొత్త రుణాలు తీసుకునేటప్పుడు బ్యాంకులు దీనిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే లోన్ రీస్ట్రక్చరింగ్‌ను ఎంచుకునే ముందు కొత్త నిబంధనలు, వడ్డీ భారం, తిరిగి చెల్లింపు కాలపరిమితి వంటి అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us