Life Insurance Corporation: దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)లో భారీ మార్పులు జరుగనున్నాయి. మే 10వ తేదీ నుంచి అన్ని ఎల్‌ఐసీ కార్యాలయాలు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయనున్నాయి. ఇక నుంచి సంస్థ ఉద్యోగులకు ప్రతీ శనివారం సెలవు ఉంటుందని బీమా సంస్థ తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటీసు సైతం జారీ చేశారు. ఎల్‌ఐసీకి శనివారం సెలవు ప్రకటించిన భారత ప్రభుత్వం .. ఏప్రిల్ 15న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు నేటి నుంచి అమలు కానున్నాయి. సంస్థ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక అదనంగా ఎల్‌ఐసీ తమ వినియోగదారులకు ఆన్‌లైన్ సేవలను సైతం అందిస్తోంది. అలాగే Https://licindia.in/ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వినియోగదారులు అనేక పనులను బ్రాంచ్ కు రాకుండానే పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే త్వరలో ఎల్‌ఐసీ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంతో లక్షకుపైగా ఎల్‌ఐసీ ఉద్యోగులకు మేలు జరుగనుంది. అయితే ఉద్యోగులకు 16 శాతం మేర వేతనం పెరగనున్నట్లు సమాచారం.
కాగా, ఎల్‌ఐసీకి కస్టమర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అంతకు ముందు కంటే కరోనా పరిస్థితుల్లో పాలసీదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలసీలు చేసుకుంటున్నారు. అలాగే కస్టమర్లను మరింతగా ఆకర్షించుకునేందుకు ఎల్‌ఐసీలో రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. డబ్బులను పొదుపు చేసుకునేందుకు, తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే విధంగా తదితర స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. అలాగే ఎల్‌ఐసీలో కస్టమర్లు క్లెయిమ్ సెటిల్‌మెంట్ వంటివి మరింత సులభతరం చేసింది ఎల్‌ఐసీ. గతంలో కంటే ఇప్పుడు కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తకుండా సులభతరమైన పద్దతులను అందుబాటులోకి తీసుకువచ్చింది.