LIC Jeevan Labh: దేశీ దిగ్గజ బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందే విధంగా ఉంటున్నాయి. పలు రకాల స్కీమ్స్‌లో డబ్బులు పెట్టడం వల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చు. లోన్ తీసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి భారీ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎల్‌ఐసీ పాలసీల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. వివిధ రకాల స్కీమ్‌లను తీసుకునే వారి సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది.
మీరు ఎంచుకునే పాలసీ ఆధారంగా మీకు లభించే బెనిఫిట్స్ కూడా మారుతూ ఉంటాయని గమనించాలి. ఎల్‌ఐసీ అందించే స్కీమ్స్‌లో జీవన్ లాభ్ కూడా ఒకటి. దీని వల్ల ప్రాఫిట్, ప్రొటెక్షన్ రెండూ ప్రయోజనాలు ఉంటాయి. 8 నుంచి 59 ఏళ్ల వరకు వయసులో ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది.
ఈ స్కీమ్‌లో కనీసం రూ.2 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీకు నచ్చిన బీమా మొత్తానికి పాలసీ పొందవచ్చు. మూడు సంవత్సరాల తర్వాత రుణం పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. చెల్లించిన ప్రీమియం మొత్తంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
పాలసీదారుడు జీవించి ఉంటే.. పాలసీ డబ్బులు, బోనస్ వంటివి మెచ్యూరిటీ తర్వాత అందిస్తారు. ఒకవేళ మరణిస్తే.. నామినీ లేదా కుటుంబ సభ్యులకు పాలసీ డబ్బులు చెల్లిస్తారు. 20 ఏళ్ల వయసులో ఉన్న వారు 16 ఏళ్ల టర్మ్‌తో రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే.. నెలకు రూ.7 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అంటే రోజుకు రూ.230 ఆదా చేస్తే సరిపోతుంది. పదేళ్లు ప్రీమియం కట్టాలి. మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.17 లక్షలకు పైగా వస్తాయి. ఈ విధంగా ఎల్‌ఐసీలో పలు స్కీమ్‌లలో మంచి రాబడి ఉంటుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం వచ్చే విధంగా ఉంటుంది. ఈ అంశాలు మీ అవగాహన కోసం మాత్రమే. కానీ స్కీమ్‌లను ఎంచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే ఎల్‌ఐసీ ఏజెంట్‌ను కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.