కోవిడ్ తో కకావికలం అయిన రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ కోలుకొంది. క్రమకమంగా పుంజుకొని మళ్లీ మునుపటి వేగాన్ని అందుకొంది. నిజం చెప్పాలంటే కోవిడ్ ముందున్న దానికంటే రెట్టింపు జోష్ లో ఆ పరిశ్రమ ఉంది. దీనికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో భూముల రేట్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దేశంలోని టైర్ 1 నగరాల్లో కోవిడ్ కు పూర్వం కన్నా ఇప్పుడు పరిస్థతి బాగా మెరుగుపడినట్లు లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 20 నుంచి 200 శాతం వరకూ వృద్ధి సాధించినట్లు డోలట్ కాపిటల్ అనే సంస్థ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా గురుగ్రామ్, హైదరాబాద్ నగరాల్లో దేశంలోనే అధిక శాతం అంటే దాదాపు 200 శాతం భూముల రేట్లు పెరిగినట్లు వివరించింది. అలాగే అపార్ట్ మెంట్ల సగటు ధర కూడా ఈ రెండు నగరాల్లో దాదాపు 19 నుంచి 79 శాతం వరకూ వృద్ధి చెందినట్లు ప్రకటించింది.
గురుగ్రామ్, హైదరాబాద్ వంటి నగరాలతో పోల్చితే ముంబై, పుణే వంటి నగరాలు రియల్ ఎస్టేట్ వృద్ధిలో కాస్త వెనుకబడినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ జాబితాలో బెంగళూరు కూడా గుర్తించదగిన వృద్ధి సాధించినట్లు వివరిస్తున్నారు. బెంగళూరు చరిత్రలోనే లేనంతగా భూముల ధరలు పెరిగినట్లు చెబుతున్నారు.
గురుగ్రామ్ లో కోవిడ్ పూర్వం స్క్వేర్ యార్డ్ ధర రూ. 30,000 నుంచి 40,000 వరకూ ఉండేది. అదే స్క్వేర్ యార్డ్ ధర ప్రస్తుత మార్కెట్లో రూ. 1.25లక్షల వరకూ వెళ్తోంది. దీనికి ప్రధాన కారణం అక్కడ జరుగుతున్న గోల్ఫ్ కోర్స్ రోడ్ ఎక్స్ టెన్షన్ పనులు, డ్వాక్రా ఎక్స్ ప్రెస్ వే వంటి వాటి చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి.
హైదరాబాద్ చుట్టుపక్కల అపార్ట్మెంట్ కల్చర్ బాగా వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. లగ్జరీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ పై ఆసక్తి కనబడుతోందని వివరిస్తున్నారు. కోవిడ్ సంక్షోభానికి పూర్వం రెండు పడకగదుల కోసం 1,200 స్క్వేర్ ఫీట్, మూడు బెడ్ రూమ్ల కోసం 1,800 స్క్వేర్ ఫీట్ ఇంకా భారీగా వేస్తే 2 ,400 స్క్వేర్ ఫీట్ వరకూ వెళ్లే వారు. కానీ ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో ఏకంగా 7000 నుంచి 10,000 స్క్వేర్ ఫీట్ లో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే ఒక సింగల్ ఫ్లోర్ మొత్తం ఒక ఫ్లాట్ గా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది ధరను కూడా అమాంతం పెంచేస్తోంది. ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ మంచి కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి ప్రధాన కారణం కోవిడ్ తర్వాత పరిస్థితుల కారణంగా ప్రజలు ఒక సొంత విలాసవంతమైన గృహాల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వడమే నని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..