
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కస్టమర్ వివరాలను అప్‌డేట్ చేసే ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసింది. కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాల్సిన ప్రతిసారీ మీ బ్యాంక్ బ్రాంచు సందర్శించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కేవైసీ అప్‌డేట్‌కు సహాయం చేయడానికి ఆర్‌బీఐ బిజినెస్ కరస్పాండెంట్లకి అనుమతి ఇచ్చింది. ఈ బీసీల్లో ఎన్‌జీఓలు, స్వయం సహాయక బృందాలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు వంటివి ఉన్నాయి. ఇకపై మీరు సమీపంలోని అధీకృత బీసీను సందర్శించడం ద్వారా మీ కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. మీరు కేవలం మీ చిరునామా మాత్రమే మారాలని కోరుకుంటే ఒక సాధారణ స్వీయ ప్రకటన ద్వారా అడ్రస్ అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.
కేవైసీ సమస్యల కారణంగా చాలా మంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు లేదా స్కాలర్షిప్స్ నుంచి డబ్బు పొందడంలో జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త వ్యవస్థ ప్రతి ఒక్కరూ తమ వివరాలను అప్‌డెటెడ్‌గా ఉండేలా చూసుకోవడంతో పాటు మరిన్ని సౌకర్యాలను పొందేలా చేస్తుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాదారులు దగ్గరల్లోని బీసీలను సందర్శించి కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. మీ అప్‌డేటెడ్ వివరాలను అందించి బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ ఉపయోగించి మీ గుర్తింపును ప్రామాణీకరించుకోవచ్చు. సంబంధిత రసీదు తీసుకొని మీ బ్యాంక్ నుండి నిర్ధారణ కోసం వేచి ఉండాలి. అయితే కేవైసీ అప్డేట్ గడువు ముగిసేలోపు మూడు రిమైండర్లను పంపాలని బ్యాంకులను ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ రిమైండర్లలో కనీసం ఒకటి భౌతికగా ఉండాలని పేర్కొంది. గడువు తేదీ తర్వాత కూడా బ్యాంకులు ఖాతాదారులకు లేఖలు లేదా సందేశాలతో గుర్తు చేస్తూనే ఉండాలి.
గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో ప్రత్యేక కేవైసీ అప్‌డేట్ శిబిరాలను నిర్వహించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. పెండింగ్‌లో ఉన్న వివరాలను అప్‌డేట్ చేయడంతో పాటు ఇన్ యాక్టివ్ అకౌంట్స్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలని కోరింది. బ్యాంకింగ్ సేవలను క్రమబద్ధీకరించడంలో ఈ-కేవైసీ కీలక పాత్ర పోషిస్తోందని, కాబట్టి ఖాతాదారులు కూడా తమ కేవైసీను అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి