సంపదను సృష్టించాలన్న, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలన్న పొదుపు చేయడం ముఖ్యం. అయితే ఒక ప్రణాళిక లేకుండా పెట్టుబడులు పెట్టినా అవి సరైన ఫలితాలను ఇవ్వవు. అందువల్ల ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం. అప్పుడే అనుకున్న సమయానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోగలుగుతారు. మీరు డబ్బును ఎందుకోసం మదుపు చేయాలనుకుంటున్నారో ముందుగా ఒక అవగాహన ఉండాలి. ఇల్లు, కారు కొనుగోలు డౌన్‌పేమెంట్ కోసం, విహారయాత్రల కోసం, పిల్లల చదువుల కోసం, పదవీవిరమణ కోసం. .ఇలా ఎందుకోసం నిధిని సమకూర్చుకోవాలో తెలిసి ఉండాలి. మీ లక్ష్యం గురించి మీకు స్పష్టమైన ఆలోచన వచ్చిన తర్వాత డబ్బును పెట్టుబడి పెట్టే విధానం సింపుల్ అవుతుంది. మీ ఆర్థిక లక్ష్యం గురించి మీకు స్పష్టత వచ్చిన తర్వాత, దాని కోసం డబ్బు సమకూర్చుకునేందుకు ఎంత సమయం ఉందో అంచనా వేయాలి. స్వల్పకాలిక, మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక లక్ష్యమైనా సమయాన్ని బట్టి పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
స్వల్పకాలిక లక్ష్యాల కోసం బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్/రికరింగ్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్లు, ఫోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు, డెట్ సాధనాలు, కార్పొరేట్ డిపాజిట్లు వంటి వాటిని ఎంచుకోవచ్చు. మీరు నెలకు 18 వేల చొప్పున మదుపు చేస్తే 6 శాతం రాబడి అంచనాతో ఒక ఏడాదిలో రూ. 2.23 లక్షల వరకు సమకూర్చుకోగలరు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం, అంటే పదవీవిరమణ వంటి వాటి కోసం 15 నుంచి 20 సంవత్సరాల సమయం ఉంటే ఎన్‌పీఎస్, పీపీఎఫ్ వంటి పథకాలలో మదుపు చేయవచ్చు. సిప్ ద్వారా మ్యూచ్‌వల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. వేగంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఎక్కువ నష్టభయం ఉన్న పథకాలలో పెట్టబడులకు సిద్ధం అవుతారు. తీరా మదుపు చేయడం ప్రారంభించన తర్వాత నష్టం వస్తే మధ్యలోనే పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల అనవసరమైన ఒత్తిడి తప్ప అనుకున్న లక్ష్యానికి కావలసిన నిధులను సమకూర్చుకోలేరు. అందువల్ల ముందుగా మీ నష్టభయాన్ని తెలుసుకోండి. దానికి తగినట్టే పెట్టుబడులు పెట్టాలి.