ఫ్రీ లుక్‌ పీరియడ్‌ అంటే ఏంటి? ఇన్సూరెన్స్‌ తీసుకునేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం!

ఫ్రీ లుక్ పీరియడ్ అనేది బీమా పాలసీదారులకు ఒక కీలక అవకాశం. ఈ సమయంలో, పాలసీ నిబంధనలు, షరతులు పూర్తిగా పరిశీలించి, నచ్చకపోతే పెద్దగా నష్టం లేకుండా రద్దు చేసుకోవచ్చు. IRDAI ప్రకారం 15-30 రోజులు ఉండే ఈ గడువులో కవరేజ్, మినహాయింపులు, క్లెయిమ్ ప్రక్రియ వంటివి జాగ్రత్తగా సమీక్షించాలి.

ఫ్రీ లుక్‌ పీరియడ్‌ అంటే ఏంటి? ఇన్సూరెన్స్‌ తీసుకునేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం!
Insurance Policy

Updated on: May 15, 2026 | 8:44 AM

బీమా పాలసీ కొనుగోలు చేసే సమయంలో చాలా మంది వినియోగదారులు బ్రోచర్లు, ఏజెంట్ల వివరణలు లేదా ఆన్‌లైన్ ప్రకటనల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంటారు. అయితే పాలసీ కొనుగోలు చేసిన తర్వాత అందులోని కొన్ని నిబంధనలు, మినహాయింపులు లేదా షరతులు ఆశించిన విధంగా లేకపోవడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇన్సూరెన్స్‌ సంస్థలు ఫ్రీ లుక్ పీరియడ్ అనే ప్రత్యేక సదుపాయాన్ని అందిస్తున్నాయి.

ఫ్రీ లుక్ పీరియడ్ అనేది పాలసీదారుడు బీమా పాలసీని పూర్తిగా పరిశీలించుకునేందుకు ఇచ్చే గడువు. ఈ సమయంలో పాలసీ నిబంధనలు నచ్చకపోతే, ఎటువంటి పెద్ద జరిమానా లేకుండా పాలసీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవిత బీమా, ఆరోగ్య బీమా వంటి దీర్ఘకాలిక పాలసీలలో ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా భావిస్తున్నారు. భారతదేశంలో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పాలసీ పత్రం అందుకున్న తేదీ నుంచి కనీసం 15 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఇవ్వాలి. ఆన్‌లైన్ లేదా దూర విక్రయాల ద్వారా కొనుగోలు చేసిన పాలసీలకు ఈ గడువు 30 రోజుల వరకు ఉంటుంది.

ఈ వ్యవధిలో పాలసీదారుడు పాలసీని రద్దు చేయాలనుకుంటే, బీమా సంస్థకు అధికారికంగా సమాచారం ఇవ్వాలి. అనంతరం సంస్థ ప్రీమియం మొత్తంలో నుంచి స్టాంప్ డ్యూటీ, వైద్య పరీక్షల ఖర్చులు, పాలసీ అమలులో ఉన్న రోజుల ప్రీమియంను మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. అందువల్ల తిరిగి వచ్చే మొత్తం పూర్తిగా చెల్లించిన ప్రీమియం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక నిపుణుల ప్రకారం ఫ్రీ లుక్ పీరియడ్‌ను నిర్లక్ష్యం చేయకుండా పాలసీదారులు ఈ సమయంలో పాలసీ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా గరిష్ట కవరేజ్ పరిమితి, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, ప్రీమియం చెల్లింపులు, క్లెయిమ్ షరతులు, నామినీ వివరాలు వంటి అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం.

బీమా పాలసీలు సాధారణంగా దీర్ఘకాలిక ఆర్థిక ఒప్పందాలు కావడంతో, ఫ్రీ లుక్ పీరియడ్ ముగిసిన తర్వాత రద్దు చేస్తే అదనపు ఛార్జీలు లేదా తక్కువ వాపసు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పాలసీ పత్రాన్ని పూర్తిగా చదివి, అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత మాత్రమే కొనసాగించడం ఉత్తమమని సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us