
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ బాగా పెరిగింది. అప్పటి వరకు ఈ విధానాన్ని అమలు చేయని కంపెనీలు సైతం ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా పూర్తిగా అంతరించింది. మూడేళ్ల క్రితం నాటి పరిస్థితులు పూర్తిగా సద్దుమనిగాయి. మాములు స్థితి వచ్చేసింది.
ఈ క్రమంలోనే కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తిపలికాయి. అయితే మరికొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులను క్రమంగా ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఈ క్రమంలోని హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా విభాగాధిపతులకు ఇ-మెయిల్ జారీచేసినట్లు తెలుస్తోంది. ‘వారానికి మూడు రోజుల చొప్పున ఆఫీసుకు రావాలి. అతి త్వరలో ఇది తప్పనిసరి కానుంది’ అని ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఎవరైనా ఉద్యోగులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. వారికి మినహాయింపు ఇవ్వనున్నట్లు సమాచారం. మరి ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హైబ్రిడ్ విధానాన్ని ఉల్లంఘించిన పలువురు ఉద్యోగులకు విప్రో వార్నింగ్ సైతం ఇచ్చింది. జనవరి నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని విప్రో ఇప్పటికే తమ ఉద్యోగులను ఆదేశించింది. ఇక టీసీఎస్ సైతం మునపటిలాగానే తమ ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీసులకు వచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించిన ఐటీ కంపెనీలు ఇప్పుడు ఉత్పాదకపై ప్రభావం పడుతున్నట్లు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే హైబ్రిడ్ విధానాన్ని ప్రారంభించి, క్రమంగా ఉద్యోగులను ఆఫీసులకు వచ్చేలా చూస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..