Infosys: ఉద్యోగం మానేసిన మహిళలకు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. రిఫర్ చేసిన ఉద్యోగులకు బోనస్

కెరీర్‌కు విరామం తీసుకున్న మహిళా నిపుణులను తిరిగి ఉద్యోగ ప్రపంచంలోకి తీసుకురావడానికి ఇన్ఫోసిస్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్. ఈ పథకంలో భాగంగా ఉద్యోగం మానేసిన మహిళలను రిఫర్ చేసి తిరిగి పనిలోకి తీసుకురావడానికి ఉద్యోగులకు మంచి బోనస్‌లు ఇస్తుంది.

Infosys: ఉద్యోగం మానేసిన మహిళలకు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. రిఫర్ చేసిన ఉద్యోగులకు బోనస్
Infosys Offers A Restart Program For Women

Updated on: Sep 19, 2025 | 8:57 PM

చాలామంది మహిళలు పెళ్లి లేదా పిల్లల కోసం ఉద్యోగం మానేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారికి ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఒక మంచి అవకాశం కల్పిస్తోంది. ఉద్యోగం మానేసి తిరిగి చేరాలనుకునే మహిళల కోసం “రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్” అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా సెలీనియం, జావా, ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో అనుభవం ఉన్న మహిళలను తిరిగి పనిలోకి తీసుకోవాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. ఇది కంపెనీలో ఉద్యోగుల మధ్య వైవిధ్యాన్ని పెంచేందుకు ఒక ముఖ్యమైన అడుగు.

రిఫర్ చేసిన ఉద్యోగులకు డబ్బులు:

ఈ పథకంలో భాగంగా ఉద్యోగం మానేసిన మహిళలను రిఫర్ చేసి తిరిగి పనిలోకి తీసుకురావడానికి ఉద్యోగులకు మంచి బోనస్‌లు ఇస్తుంది.

జాబ్ లెవల్ 3: రూ.10,000
జాబ్ లెవల్ 4: రూ.25,000
జాబ్ లెవల్ 5: రూ.35,000
జాబ్ లెవల్ 6: రూ.50,000

ఈ బోనస్‌లు, రిఫర్ చేయబడిన అభ్యర్థి ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లిస్తారు.

ఎలాంటివారు అర్హులు..?

ఈ అవకాశాన్ని పొందాలంటే అభ్యర్థులు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. అలాగే కనీసం ఆరు నెలలు ఉద్యోగం మానేసి ఉండాలి. ఇన్ఫోసిస్ ప్రకారం.. కెరీర్‌కు విరామం తీసుకున్న మహిళలకు మద్దతు ఇవ్వాలన్నది వారి లక్ష్యం.

మహిళా ఉద్యోగుల సంఖ్య పెంచడమే లక్ష్యం:

ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో పని చేసే 3.2 లక్షల మంది ఉద్యోగులలో 39శాతం మంది మహిళలు. ఈ సంఖ్యను 2030 నాటికి 45శాతానికి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నాలతో ఇన్ఫోసిస్ కేవలం తమ కంపెనీలో మాత్రమే కాకుండా మొత్తం ఐటీ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కృషి చేస్తోంది.

ఇన్ఫోసిస్ CHRO షాజీ మాథ్యూ మాట్లాడుతూ.. తమ సంస్థ ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ లక్ష్యాల్లో చేరిక ప్రధాన అంశమని తెలిపారు. ఈ కార్యక్రమం టెక్ రంగంలో ప్రతిభావంతులైన మహిళలను తిరిగి ఉద్యోగంలో చేరేలా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనే ఈ కార్యక్రమం ద్వారా ఇన్ఫోసిస్ 900 మందికి పైగా మహిళలను మధ్యస్థాయి ఉద్యోగాల్లో నియమించుకుంది. ఇలాంటి పథకాలతో ఇన్ఫోసిస్ ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..