Indusind Bank: ఆందోళనలో ఇండస్ ఇండ్ ఖాతాదారులు.. డబ్బు సురక్షితమేనా..?
ఆర్‌బీఐ చర్యలతో ఇండస్ ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా ఇండస్ఇండ్ బ్యాంక్‌కు సంబంధించి చాలా గందరగోళం నెలకొంది. ఆర్‌బీఐ తన సీఈఓ పదవీకాలాన్ని ఒక సంవత్సరం మాత్రమే ఆమోదించగా, బ్యాంక్ దానిని 3 సంవత్సరాలకు ఆమోదించింది. అయితే తాజాగా బ్యాంకుకు సంబంధించిన డెరివేటివ్‌లకు సంబంధించిన ఇటీవలి అకౌంటింగ్ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.

డెరివేటివ్‌లకు అవకతవకల కారణంగా ఇండస్ ఇండ్ పన్ను అనంతర నికర విలువ 2.35 శాతం తగ్గింది. మార్చి 10న దాని షేర్లు కుప్పకూలి, రికార్డు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మార్చి 11న కూడా స్టాక్ క్రాష్ అయ్యింది. దీంతో పాటు బ్రోకరేజ్ సంస్థ బ్యాంకు రేటింగ్, లక్ష్య ధరను తగ్గించింది. మొత్తం మీద ఇండస్ ఇండ్ బ్యాంకు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ బ్యాంకులో రూ.4 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ చేసిన కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. మరి ఇండస్ఇండ్ బ్యాంక్‌లో డబ్బు సురక్షితంగా ఉందా? అనే ఆందోళనలో ఖాతాదారులు ఉన్నారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండస్ఇండ్ బ్యాంక్‌పై ఎటువంటి నిషేధం విధించలేదు లేదా ఎటువంటి పెద్ద చర్య తీసుకోలేదని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి ఉపసంహరణను ఆపడానికి ఆర్‌బీఐ ఎటువంటి చర్య తీసుకోలేదు. అయితే, బ్యాంకులో అవకతవకలు పెరిగినప్పుడు ఆర్‌బీఐ ఉపసంహరణపై నిషేధం విధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిషేధం కనీసం 6 నెలలు ఉంటుంది. ఈ కాలంలో ఎవరూ బ్యాంకు నుంచి డబ్బు తీసుకోలేరు. దీని తరువాత బ్యాంకు పరిస్థితిని మెరుగుపరచడానికి ఆర్‌బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఒక నిర్దిష్ట పరిమితి వరకు డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇస్తారు. యస్ బ్యాంక్, న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ప్రస్తుతం ఇండస్ఇండ్ విషయంలో అలాంటిదేమీ జరగడం లేదు.
డిసెంబర్ 31, 2024 నాటికి, బ్యాంకులో డిపాజిట్లు సంవత్సరానికి 11 శాతం పెరిగి రూ.4,09,438 కోట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఇది రూ.3,68,793 కోట్లుగా ఉంది, పొదుపు డిపాజిట్లు 6 శాతం పెరిగాయి. ఈ బ్యాంకుకు మొత్తం 4.2 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అయితే ఒకవేళ్ల ఇండస్ ఇండ్ బ్యాంకు మూసివేస్తే బ్యాంకుల్లో జమ చేసిన డబ్బుకు కూడా బీమా ఉన్నందున, కస్టమర్‌కు సంబంధించిన రూ. 5 లక్షల వరకు డిపాజిట్ సురక్షితం. కానీ ఈ బీమా రూ. 5 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది. దీని కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మిగిలిన డబ్బు నష్టపోవాల్సి వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..