Indian Railways: భారత్‌లో తొలి బుల్లెట్ ట్రైన్.. ఈ డేట్ నుంచే అందుబాటులోకి.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్

భారత్‌లో బుల్లెట్ ట్రైన్లను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే తయారీ పనులు జరుగుతోండగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. బుల్లెట్ రైళ్లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై డేట్‌ను ప్రకటించింది. తొలి రైలు ఏ ప్రాంతాల మధ్య వస్తుందనే వివరాలు కూడా అనౌన్స్ చేసింది.

Indian Railways: భారత్‌లో తొలి బుల్లెట్ ట్రైన్.. ఈ డేట్ నుంచే అందుబాటులోకి.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్
Bullet Train

Updated on: Jan 01, 2026 | 6:51 PM

ప్రస్తుతం చాలా దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. భారీ వేగంతో ప్రయాణించే ఈ రైళ్లల్లో గమ్యస్థానాలకు వెంటనే చేరుకోవచ్చు. విదేశాల్లో వచ్చినా.. ఇప్పటివరకు భారత్‌లో ఇంకా బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెట్టలేదు. అయితే బుల్లెట్ రైళ్లను తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తున్న కేంద్రం.. వీటి తయారీపై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో భారత్‌లో బుల్లెట్ రైళ్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా డేట్‌ను కూడా ప్రకటించేశారు. జనవరి 1న ఢిల్లీలో ఆయన మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌లో బుల్లెట్ రైలు ఏ రోజున ప్రారంభిస్తామనే విషయంతో పాటు తొలి రైలు ఏ రూట్లలో ప్రవేశపెడతామనే వివరాలు కూడా వెల్లడించారు.

తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడంటే..?

వచ్చే ఏడాది 2027 ఆగస్టు 15న తొలి బుల్లెట్ రైలును ప్రారంభించనున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. తొలి బుల్లెట్ రైలును సూరత్ నుంచి బిలిమోరా వరకు నడుపుతామన్నారు. ఆ తర్వాత వాపీ నుంచి సూరత్, వాపీ-అహ్మదాబాద్, థానే-ఆహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెడతామన్నారు. వీటి తర్వాత ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బుల్లెట్ ట్రైన్ కోసం ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల హైస్పీడ్ ట్రైన్ కారిడార్ నిర్మిస్తామని పేర్కొన్నారు.

2 గంటల్లోనే ప్రయాణం

బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని ద్వారా ముంబై-అహ్మదాబాద్ మధ్య కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చన్నారు. ఈ మార్గంలో ఇప్పటికే కారిడార్ పనులు 320 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయిన, స్టేషన్, సొరంగ నిర్మాణాలు, విద్యుత్ పనులు కొనసాగుతున్నాయన్నారు. 2027లో తొలి ఆపరేషన్ రన్ అవుతుందని, 2029 నాటిక అన్నీ పూర్తవుతాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.