AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, విమానం తరహాలో రైల్లో కొత్త ఫీచర్..

రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త! త్వరలోనే మీరు రైలు టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన సీటును మీరే ఎంపిక చేసుకునే అవకాశం రానుంది. బస్సులు, విమానాల్లో ఉన్నట్టే, ఇప్పుడు రైళ్లలోనూ ఈ సౌలభ్యం అందుబాటులోకి రాబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా భారతీయ రైల్వే ఈ సీట్ సెలెక్షన్ ఫీచర్ను తీసుకురానుంది. అదేమిటో చూడండి...

Indian Railway: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, విమానం తరహాలో రైల్లో కొత్త ఫీచర్..
Indian Railway New Feature
Bhavani
|

Updated on: Jul 01, 2025 | 3:31 PM

Share

ప్రస్తుతం, ఐఆర్‌సీటీసీ (IRCTC) ఇతర రైలు బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో టిక్కెట్ బుక్ చేస్తే సీటు ఆటోమేటిక్‌గా కేటాయిస్తారు. ఇకపై ఈ విధానం మారనుంది. ప్రయాణికులు ఏ కోచ్‌లో, ఏ సీటు కావాలో స్వయంగా ఎంచుకోవచ్చు. దీని కోసం రైల్వే శాఖ మోడరన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను తీసుకురానుంది. ఈ వ్యవస్థ 2025 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అమలవుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఈ నూతన వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక టిక్కెట్ బుకింగ్ పూర్తిగా డిజిటల్‌గా, పారదర్శకంగా మారుతుంది. పాత సాఫ్ట్‌వేర్ లోవర్ బర్త్ ప్రాధాన్యత, కిటికీ పక్కన సీటు వంటి కొన్ని ఆప్షన్లు మాత్రమే చూపిస్తుంది. కానీ కొత్త సిస్టమ్ సీటింగ్ మ్యాప్‌ను పూర్తిగా చూపిస్తుంది. అందులో ఖాళీగా ఉన్న సీట్లను చూస్తూ, మీకు నచ్చిన స్థానాన్ని ఎంచుకోవచ్చు.

ప్రయాణికులకు ప్రయోజనాలేంటి?

ఈ మార్పుతో ప్రయాణికులకు ఎన్నో లాభాలున్నాయి. కుటుంబ సభ్యులు కలిపి ప్రయాణిస్తుంటే అందరూ ఒకే కోచ్‌లో, పక్క పక్కన సీట్లు బుక్ చేసుకోవచ్చు. వృద్ధులు, చిన్న పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు తమకు సౌకర్యవంతమైన బెర్త్‌ను ఎంచుకోవచ్చు. రాత్రిపూట ప్రయాణానికైతే లోవర్ బర్త్ కావాలనుకునేవారు ముందుగానే ఎంచుకుంటారు. పగటి ప్రయాణమైతే కిటికీ పక్కన కూర్చునే సీటును ఎంచుకోవచ్చు.

వేగవంతమైన బుకింగ్:

ఈ కొత్త టెక్నాలజీతో నిమిషానికి సుమారు 1.5 లక్షల టిక్కెట్లు బుక్ చేయగల సామర్థ్యం ఉంటుంది. దీంతో టిక్కెట్ బుకింగ్ వేగం గణనీయంగా పెరుగుతుంది. పీక్ టైమ్‌లో సర్వర్లు హ్యాంగ్ కావడం, బుకింగ్ సమస్యలు వంటి వాటికి ఇది పరిష్కారం.

ఈ సదుపాయం ప్రారంభమైన తర్వాత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు తమకు ఇష్టమైన సీటును మాన్యువల్‌గా ఎంచుకోగలుగుతారు. ప్రతి బోగీ డిజిటల్ మ్యాప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులో ఎలాంటి సీట్లు ఖాళీగా ఉన్నాయో కనిపిస్తుంది. ఈ మార్పు ప్రయాణికులకు ఎన్నో మేళ్లు చేకూరుస్తుంది. బుకింగ్ సమయంలో ఉండే సందేహాలు తొలగిపోతాయి. సీటు ఖాళీ ఉందా లేదా అనే అనుమానాలు ఉండవు. బుకింగ్ ముందు సీట్ ఎంపిక ఉండటం ప్రయాణం పట్ల ఆనందాన్ని పెంచుతుంది.

రైల్వే శాఖ తీసుకుంటున్న ఈ నిర్ణయంతో భారతీయ రైల్వే టెక్నాలజీపై పెట్టుబడి మరింత బలపడుతోంది. టిక్కెట్ బుకింగ్ అనుభవాన్ని ప్రయాణికుల ఇష్టానికి తగ్గట్టుగా మార్చే ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో మరింత సానుకూలత తెస్తుంది. విమానయాన రంగంలో ఇది ఇప్పటికే సాధారణం. ఇప్పుడు అదే వాతావరణాన్ని రైళ్లలోనూ అనుభవిస్తాం. దేశవ్యాప్తంగా కోటి మంది రోజూ రైళ్లలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో, ఈ ఫీచర్ రైల్వేకు ఒక గేమ్ ఛేంజర్‌గా మారుతుంది.