రైలు ప్రయాణం అంటే కాస్త చౌకగా.. సురక్షితంగా ఉంటుందని అందరూ భావిస్తారు. దూర ప్రయాణాలకు రైల్వేలపైనే ఆధారపడతారు సామాన్యులు. రైలు ప్రయాణం కోసం ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకోవడం సాధారణం. అయితే, అప్పటికప్పుడు.. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తే రైల్వే ఇచ్చే తాత్కాల్ రిజర్వేషన్ పై చాలా మంది ఆధారపడతారు. అత్యవసరం.. తప్పనిసరి ప్రయాణం ఉన్నవారు తాత్కాల్ టికెట్ తీసుకోవడం జరుగుతుంది. మామూలు రిజర్వు టికెట్ కంటే.. తాత్కాల్ రిజర్వు టికెట్ పై అధిక ఛార్జీ వసూలు చేస్తుంది.. ఇది ఎప్పుడూ ఉండేదే. కానీ, ఇటీవల కాలంలో ఈ తాత్కాల్ చార్జీలను భారీగా పెంచింది రైల్వే. రూటును బట్టి ట్రైన్ ను బట్టి ఈ ఛార్జీలు టికెట్ ధరకు దాదాపు 90 శాతం వరకూ ఉంటున్నాయి.
ప్రముఖ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్ళిన ఒక వ్యక్తి తిరుగు ప్రయాణంలో నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ కు తాత్కాల్ లో టికెట్ తీసుకున్నారు. థర్డ్ ఏసీ తత్కాల్ టికెట్ కోసం ఆయన 1,150 రూపాయలు చెల్లించారు. ఇదే ప్రయాణానికి రెగ్యులర్ టికెట్ ఖరీదు 645 రూపాయలు మాత్రమే. 505 రూపాయలు అంటే 78 శాతం అదనంగా చెల్లించాల్సి వచ్చింది.
తత్కాల్ టికెట్ల కోసం రెగ్యులర్ టికెట్ ప్రాథమిక ధరపై కనీసం 30 శాతం అదనపు మొత్తాన్నివిధిస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. అయితే, ఈ మొత్తం అనేక రైళ్లలో 80, 90 శాతం వరకు పెరుగుతోంది. ముందు చెప్పుకున్న ఉదంతంలో సికింద్రాబాద్-తెనాలి థర్డ్ ఏసీ ప్రాథమిక ఛార్జి రూ.610 అయితే 30 శాతం అదనంతో రూ.800.. రిజర్వేషన్, సూపర్‌ఫాస్టు ఛార్జీలతో రూ.900 లోపే ఉండాలి. కానీ రూ.1,150 అవుతోంది.
తత్కాల్ టికెట్లపై రైల్వే శాఖ స్లీపర్‌లో రూ.100- రూ.200, థర్డ్ ఏసీలో రూ.300- రూ.400, సెకండ్ ఏసీలో రూ.400- 500 వసూలు చేస్తోంది. అయితే, 200 నుంచి 400 కి.మీ. దూరం వరకు ప్రయాణించేవారిపై ఈ భారం కాస్త అధికంగానే ఉంటుంది. ఎందుకంటే, రైల్వేశాఖ ఏసీ ప్రయాణాలకు కనీస దూరంగా 500 కి.మీ. పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో 500 కిలోమీటర్ల లోపు ప్రయాణం చేసే వారికి కూడా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారి లెక్కలోనే టికెట్ ధర ఉంటుంది. ఉదాహరణకు సికింద్రాబాద్-విజయవాడ వరకు చూస్తే- ఫలక్‌నుమా, కృష్ణా ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్ సహా పలు రైళ్లలో థర్డ్ ఏసీ తత్కాల్ టికెట్ ధర రూ.1,150గా ఉంది. అదే రెగ్యులర్ టికెట్లు అయితే రూ.645 మాత్రమే.
ఇక ఈ ధరలు కూడా రైలుకో రకంగా ఉంటూ వస్తున్నాయి. కొన్ని రైళ్లలో తత్కాల్ ఛార్జీలు తక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్-విజయవాడకు వందేభారత్‌లో ఛైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ టికెట్ల ధరలు వరుసగా రూ.819, 1650 అయితే తత్కాల్‌లో రూ.1,039, 2,100గా ఉన్నాయి. బెజవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఛైర్‌కార్ టికెట్ రూ.515 అయితే తత్కాల్‌లో రూ.645 గా ఉన్నాయి. ఇలా రేట్లను అటు ఇటూగా పరిశీలిస్తే.. ఈ తత్కాల్ ట్రైన్‌లలో అదనంగా 30 శాతం వరకు ఎక్కువగా ఉంది. ఈ అవసరాన్ని రైల్వేశాఖ సొమ్ము చేసుకుంటోందని చెప్పవచ్చు. రైల్వేశాఖ స్లీపర్ క్లాస్ కోచ్‌లలో 30 శాతం సీట్లను తత్కాల్ కింద విక్రయాలు కొనసాగిస్తోంది. థర్డ్ ఏసీ, ఛైర్‌కార్‌లో ఒక్కో బోగీలో 16 బెర్తులు, సెకండ్ ఏసీలో 10 బెర్తులు, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్‌లో 5 బెర్తులు తత్కాల్ కోటా కింద అందుబాటులో ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి