
రిజర్వేషన్ చార్ట్ తయారీ, తత్కాల్ బుకింగ్‌లకు సంబంధించిన ఇటీవలి కొత్త రూల్స్ తీసుకొచ్చిన రైల్వే మంత్రిత్వ శాఖ.. తాజాగా టికెటింగ్ ప్రక్రియలో కీలక మార్పును ప్రవేశపెట్టింది. మంగళవారం జారీ చేసిన కొత్త సర్క్యులర్‌లో ప్రత్యేక ప్రయాణ అభ్యర్థనలను నిర్వహించడానికి సవరించిన నియమాలను ప్రవేశపెట్టింది. ఇది కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, చివరి నిమిషంలో జాప్యాలను నివారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాన్ని రైలు బయలుదేరే ఎనిమిది గంటల ముందుకి మార్చిన తర్వాత, రైల్వే మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ కోటా రిక్వెస్ట్‌లను సమర్పించడానికి సమయ మార్గదర్శకాలను సవరించింది. సర్క్యులర్ ప్రకారం.. రైళ్లలో అత్యవసర కోటా కోరుకునే ప్రయాణీకులు ఇప్పుడు ప్రయాణానికి ఒక రోజు ముందు తమ అభ్యర్థనను సమర్పించాలి. ఈ కొత్త రూల్ అన్ని రైళ్లకు వర్తిస్తుంది.
“రాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే అన్ని రైళ్లకు ఎమర్జెన్సీ కోటా అభ్యర్థన ప్రయాణానికి ముందు రోజు 12 గంటల వరకు EQ సెల్‌కు చేరుకోవాలి అని సర్క్యులర్ పేర్కొంది. మధ్యాహ్నం 2.01 గంటల నుండి రాత్రి 11.59 గంటల మధ్య బయలుదేరే మిగిలిన అన్ని రైళ్లకు అత్యవసర కోటా అభ్యర్థన ప్రయాణానికి ముందు రోజు 4 గంటల వరకు EQ సెల్‌కు చేరుకోవాలి అని సూచించింది. రైలు బయలుదేరే రోజున అందే అభ్యర్థనలు అంగీకరించరు.
ఆదివారాలు లేదా ప్రభుత్వ సెలవు దినాలలో బయలుదేరే రైళ్లకు అభ్యర్థనలు సెలవు దినాల కంటే ముందే చేయాలని సర్క్యులర్ పేర్కొంది. ఆదివారాల్లో లేదా ఆదివారం తర్వాత క్లబ్‌డ్ సెలవు దినాల్లో అత్యవసర కోటా విడుదల చేయాల్సిన రైళ్లలో వసతి విడుదల కోసం అభ్యర్థనలను మునుపటి పని దినం కార్యాలయ సమయాల్లో ఇవ్వాలి అని సర్క్యులర్ పేర్కొంది.
రైల్వే బోర్డు రిజర్వేషన్ సెల్ VIPలు, రైల్వే అధికారులు, సీనియర్ అధికారులు, ఇతర విభాగాల నుండి వచ్చే EQ అభ్యర్థనలను పెద్ద మొత్తంలో నిర్వహిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. కోటాను న్యాయంగా, సాధారణ వివేకంతో కేటాయించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని సర్క్యులర్ పేర్కొంది. అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. రైలు చార్టులు ఆలస్యం కాకుండా ఉండేందుకు సవరించిన సమయాలను కచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ అధికారులందరినీ కోరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి